తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాగానే, అత్యవసరంగా జరిగే ప్రారంభోత్సవాలన్నీ వాయిదా పడ్డాయి. అందులో ముఖ్యమైనది తెలంగాణ నూతన సచివాలయ భవనం. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఫిబ్రవరి 17న ఘనంగా ప్రారంభిద్దామని అనుకునే సరికి డామిట్ కథ అడ్డం తిరిగింది. వివరాల్లోకి వెళితే…

తెలంగాణలో 28 ఎకరాల్లో స్టార్ హోటల్ రేంజ్ లో నిర్మించిన నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. నిర్మాణం మొదలుపెట్టిన దగ్గర నుంచి వివాదాలే ఉన్నా, మొండిగా ముందుకు నడిపించిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కోడ్ అమలులోకి వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసింది. త్వరలోనే ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని సచివాలయ అధికారులు తెలిపారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ను సీఎస్ శాంతికుమారి సంప్రదించారు. అయితే ఆశాజనక స్పందన రాకపోవడంతో విధిలేక వాయిదా వేశారు.
తెలంగాణ సచివాలయం అతి సుందరంగా తయారవుతోంది. మొత్తం నిర్మాణ విస్తీర్ణం చదరపు అడుగుల్లో చూస్తే 10,51,676 వచ్చింది. సెక్రటరేట్ భవనాన్ని 265 అడుగుల ఎత్తున నిర్మించారు. పాత సచివాలయం ప్రాంగణంలోనే కొత్త సచివాలయాన్ని 2020 జనవరిలో కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించింది. 11 అంతస్తుల ఎత్తులో నిర్మాణం కనిపించినా ఆరో అంతస్తులో పరిపాలనంతా సాగుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం, మంత్రివర్గ సమావేశ మందిరం ఆరో అంతస్తులో ఏర్పాటుచేశారు. బహుశా కేసీఆర్ లక్కీనంబర్ ఆరు కావడంతో అలాగే డిజైన్ చేశారని కొందరు అనుకుంటున్నారు.

16 మంది మంత్రుల కార్యాలయాలను 2 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. సాధారణ పరిపాలన, ఆర్థికశాఖల కార్యాలయాలను ఒకటి, రెండు అంతస్థుల్లో ఏర్పాటు చేశారు. ఇక ఇతర శాఖల కార్యాలయాలను 3 నుంచి 5 అంతస్తుల్లో ఏర్పాటు చేస్తున్నారు. పార్కింగ్ కోసం మంత్రులు, ముఖ్యమంత్రికి వేర్వేరుగా ఏర్పాటు చేస్తున్నారు.
ఉన్నతాధికారులు, సిబ్బంది, సందర్శకులకు కూడా ప్రాంగణంలోనే పార్కింగ్ సదుపాయం కల్పించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో సచివాలయ సిబ్బంది, స్టోర్స్ డిపార్ట్ మెంట్ ఉంటాయి. 7 నుంచి 11 అంతస్తుల ఎత్తులో డోములు నిర్మించారు. 34 చిన్న గుమ్మటాలు, 2 మెయిన్ గుమ్మటాలు ఏర్పాటు చేశారు. ప్రధానమైన రెండు గుమ్మటాలపై 18 అడుగుల ఎత్తులో జాతీయ చిహ్నమైన నాలుగు సింహాలను ఏర్పాటు చేస్తున్నారు.


భవనంలోకి గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా విశాలమైన కిటీకీలు, ద్వారాలు ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు ఆరు అంతస్తుల్లో మొత్తం పరిపాలన అంతా సాగేలా సచివాలయ ప్రధాన భవనాన్ని 7.88 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించారు. మధ్యలో భవనంపైన ఐదు అంతస్తుల వరకు కూడా భారీ గుమ్మటాలతో కూడిన సెంట్రల్ టవర్ నిర్మాణం జరిగింది. అంతేకాదు అతిథుల కోసం కూడా ప్రత్యేకంగా పోర్టికో టవర్స్ నిర్మించారు. అక్కడ నుంచి చూస్తే హైదరాబాద్ కనిపించేలా ప్లాన్ చేశారు. వీటిని మాత్రం మన రేంజ్ కు తగినట్టుగా ఆర్నమెంటల్ డోమ్స్, కార్వింగ్స్ తో అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు.