26.4 C
Hyderabad
Tuesday, July 15, 2025
spot_img

తమిళనాట గురు రూప రాక్షసుల ఘాతుక కృత్యం- అభం శుభం తెలియని పసి విద్యార్థినిపై లైంగిక వేధింపులు

ఎక్కడికి వెడుతోంది ఈ సమాజం. ఎంతో అధునాతన సాంకేతికతో సెల్, స్మార్ట్, సాఫ్ట్ నుంచి ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వరకు కృత్రిమతో సర్వం సాధ్యం చేస్తూ హిమగిరి శిఖరాల అంత ఎత్తు ఒకవైపు ఎదుగుతుంటే..బుర్రలు అధఃపాతాళానికి దించుకోవాల్సిన విధంగా మానవత్వం మంటకల్సే చర్యలు మరోవైపు సాగుతున్నాయి. దుర్ఘటన జరగడం గ్రహపాటు అనుకున్నప్పుడు దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంటుంది కదా.! బాధ్యత సరిదిద్దుకోక పోగా.. తొలిసారి గ్రహపాటును రెండోసారి పొరపాటు అంటున్నారు. చివరగా గ్రహపాటు, పొరపాట్లను అలవాటైపోయిందనే రీతిలో పాలకులు, అధికారులు వ్యవహరిస్తున్నారు. తెల్లవారితే నేరాలు, ఘోరాలు, ప్రమాదాలు… ఘటన జరిగిన వెంటనే హడావుడి చేసేసి.. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో ఈ తరహా ఘటనలు జరగనివ్వం అనడం…ఈ మాటలు పూర్తవ్వక మునుపే మరో చోట ఇదేతంతు. ఉదాహరణకో ఏదో ఫైనాన్స్ కంపెనీ బోర్డు తిప్పేస్తే..లబోదిబోమని బాధితులు గోలెడితే.. పాలకులు తామున్నాం.. ఏం భయం లేదు అని భరోసాలు, హామీలు ఇవ్వడం తప్ప.. క్రియ మాత్రం శూన్యంగానే ఉంటోంది. ఏపీలో అగ్రీ గోల్డ్ వ్యవహారం చూస్తే.. సొమ్ము పోగొట్టుకుని బాధితులు విలపిస్తుంటే.. ఆ సంస్థ ల్యాండ్ లో అక్రమార్కులు మొక్కలు, చెట్లు పెంచేసి కోట్లు గడించేశారంటే.. పాలక ప్రభువులు ఏం చేస్తున్నారు..? అధికారగణాలు చోద్యం చూస్తున్నాయా..? తిరుమలలో తొక్కిసలాట జరిగి నిండు ప్రాణాలు గాల్లో కలిసి పోయాయి.. ముక్కోటి, వైకుంఠ ఏకాదశి అంటే ఎంత భక్తజన వరద ప్రవహిస్తుందో అందరికీ తెలిసిందే.. అంతకు ముందు గోదావరి పుష్కరాల్లో, కృష్ణా పుష్కరాల్లో…ఇలా ఎన్నో చోట్ల భక్తుల ప్రాణాలు కోల్పోయారు. ఇక సినిమాలు, హీరోల రాక, ఫంక్షన్ల సంగతైతే చెప్పే అక్కర్లేదు, అక్కడ ఇలాంటి విషాద ఘటనలు ఎన్నో జరిగాయి. ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళాలో తొక్కిసలాట ఘటనలో ఎందరో భక్తుల ప్రాణాలు కోల్పోయారు. రెండు, మూడు సార్లు అగ్నిప్రమాద ఘటనలు ఇక్కడ చోటుచేసుకున్నాయి.

ప్రమాదం జరిగాక పెద్ద పెద్ద కబుర్లు చెప్పి.. ఇక ముందు ఈ తరహా ఘటనలు జరగనివ్వం అని చెప్పే పెద్దలు.. అలాంటి బోల్డ్ బోల్డ్ సంఘటనలు జరుగుతున్నా అదే రీతి విసుగు చెందే మాటలు మాట్లాడడం ఏం సబబు..? ప్రమాదాలు జరిగినప్పుడు సొమ్ము సమర్పించేశాం అని చెబుతూంటారు. ఏదో అర కొర సొమ్ము ఇచ్చేది ఎవరికి మృతుల కుటుంబాలకు. నిండు నూరేళ్లు బతకాల్సిన నిక్షేపంలాంటి మనిషి అర్థంతరంగా మృతికి గురై.. తిరిగి రాని లోకాలకు ఆ ప్రాణి వెళ్లిపోతే..ఆ జీవికి జరిగిన అన్యాయం ఏం చేస్తే తీరుతుంది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్ అంటారు. ఆ చర్యలు చేపట్టాలి. ఒక్క ప్రాణం పోయినా బాధ్యత వహించాలి. ఎంత పెద్ద పదవైనా త్యంజించి.. ఆ ఘటనకు పశ్చాత్తాప పడాలి. చిన్న రైలు ప్రమాదం జరిగిందని.. మాజీ ప్రధాని, దివంగత మహానేత లాల్ బహదూర్ శాస్త్రి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి పదవికే రాజీనామా చేయలేదా…? శుష్క వాగ్దానాలు మానుకుని.. ఏ ఈవెంట్ లోనైనా జనాల గేదరింగ్, ప్రజా సమూహాలు అధికంగా ఉండే సందర్భాల్లో ఖచ్చితంగా ముందస్తు చర్యలన్నీ చేపట్టి ఏ ప్రమాదం జరగకుండా చూడాలి. ప్రమాదం జరిగాక ఇలాంటి ప్రమాదాలు ఇకపై జరగవని పసలేని మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. మరోసారి ఈ తరహా ప్రమాదం జరిగితే కాలక్షేప కబుర్ల మాదిరి హామీలు కాదు.. మూల్యం చెల్లించుకుంటాం, పదవులు వదులుకుంటాం.. అనే రీతిలో మాట్లాడాలి. ఒకవేళ్ల దుర్ఘటనలు జరిగితే ఆ మాటలకు కట్టుబడి ఉండాలి. మరొకరు ఎవరైనా ఆ గద్దెలు ఎక్కెతే.. వాళ్లకు ఇదే వర్తించాలి.

ఎప్పుడో సుబోధ్ గుప్తా అందరికీ మంచి బుద్ధి కలగాలనే ఉద్దేశంతో గాంధీజీ త్రీ మంకీస్ శిల్పాల శ్రేణిని రూపొందించాడు. తెలివైన ఆ మూడు మర్కటాలు…తెలివి కొల్పొతున్న సమాజాన్ని తట్టి లేపడానికి చెడు చూడవద్దు, చెడు వినవద్దు, చెడు మాట్లాడవద్దు అనే సూత్రాలు వచించాయి. అయితే…ఎడ్డెం, తెడ్డెం వ్యవహారంలా.. దీనికి రివర్స్ లో అన్ని జరిగిపోతున్నాయి. చెడు చూస్తాం, చెడు వింటాం, చెడు మాట్లాడతాం.. ఎవరేం చేయగలరు.. తాము ఆ పార్టీ వారం, తమకు ఆ అండ ఉంది, ఈ నేత మా చుట్టం, మరో నేత మా పక్కం.. రూలర్లు, నాన్ రూలర్లు అందరూ మా నైబర్లే.. అంటూ కోతలు, కబుర్లు చెప్పేస్తూ నేరగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారు. కొన్నింట ఇవీ నిజాలు కావడం జరుగుతోంది. అందుకే జైలు కెళ్లిన వాళ్లు క్షణాల్లో బెయిల్ మీద రావడం ఏ రెయిల్లోనో ఎక్కి నీట్ గా సొంతూళ్లకు, ఇళ్లకు వచ్చేయడం.. నేరాలకు తిరిగి రెడీ అవ్వడం జరుగుతోంది. రాజకీయ నేతల అండదండలు క్రైం గ్యాంగ్ లకు ఇటీవల అధికంగా ఉండడం కనిపిస్తోంది.

ఎందుకు నేరాలు పెరిగిపోతున్నాయని ప్రశ్నించుకున్నా, నేరగాళ్లు జైళ్లలో కాక రైళ్లల్లోనో, బస్సుల్లోనో..రోడ్ల మీదో ఎందుకు దర్జాగా తిరుగుతున్నారు అంటే శిక్షలు కఠినంగా లేవు..అని కొందరు అంటుండగా, జైళ్లు ఖాళీ లేవు అని మరికొందరు అంటున్నారు. గుప్తా డైనాస్టీ ఈజ్ గోల్డెన్ డైనాస్టీ.. తెలుగులో చెప్పాలంటే.. గుప్తుల కాలం స్వర్ణయుగం. అంతలా ఆ పాలకుల యుగం బంగారుమయంగా మారడానికి కారణం…నేరస్తులకు కఠినమైన శిక్షలు అమలు చేయడమే. మరో వ్యక్తి నేరం చేయడానికి భయపడే విధంగా నాడు శిక్షలు ఉండేవి. అందుకే అది స్వర్ణయుగం అయ్యింది. ఇప్పుడు బడాబాబుల తనయులో, వాళ్ల అనుయాయులో నేరాలు, ఘోరాలు, దారుణాలకు పాల్పడితే.. ఏ నిరుపేద అమాయకుడినో ఆ కేసులో ఇరికించి…అకారణం ఆ పేదవాడిని చిత్రహింసలకు గురిచేయడం, లేదంటే ప్రాణాలు తీసేయడం.. ఇవీ సమాజంలో ఇప్పుడు జరిగే ఘటనలు. పాపభీతి అనే మాటకే తావు లేకుండా బడాబాబులు, కొందరు రాజకీయ నేతలు వ్యవహరిస్తుంటే.. నీతి నిజాయితీగల అమాయక ప్రజలు అకారణంగా అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు.

ఇక నేరాలు, ఘోరాలు, క్రూరాతి క్రూర దారుణాలు చేసేవారి శిక్షల విషయాల్లో సైతం ఇదే తరహా శుష్క వాగ్దానాలు చేసేస్తున్నారు. బాధితుల కుటుంబీకులకు పదో, పరక చెల్లించేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఇటీవల తమిళనాడులో ఘోరాలు, నేరాలు చూస్తుంటే యావత్ సమాజమే భయభ్రాంతులకు గురయ్యేలా ఉంది. తమిళనాడు అంటే.. అతి పురాతన నాగరికతా ప్రదేశంగా చరిత్రలో పేరుంది. ఇక్కడ ఆస్తికత, నాస్తికత రెండు అగ్రభాగాన ఉంటాయి. ఇక్కడున్న అతిపెద్ద ప్రాచీన ప్రాకారాలతో ఉన్న దేవళాలు, ఆధ్యాతిక వైభవం ఎక్కడ ఉండదంటే అతిశయోక్తి కాదేమో. మరో వైపు ఏలికలు, పాలకులు ఎందరో.. ఎందరెందరో నాస్తిక సమాజానికి చెందిన వారే. అయినా, అందరూ కలిసి మెలిసి ఉండడం.. ఏక మాటపై, ఏక బాటపై వెళ్లడం జరుగుతుంది. ఒక ప్రభుత్వం ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ది పథకాలను.. మార్పులు లేకుండా, బేషజాలకు పోకుండా.. ప్రజా శ్రేయస్సు కోసం మరో ప్రభుత్వం దానిని కంటిన్యూ చేయడం ఇక్కడి అధికార, విపక్ష నేతల గొప్పదనం. అయితే, ఇటీవల తమిళ నాట చోటు చేసుకుంటున్న కొన్ని దారుణకృత్యాలు, విపరీత పరిణామాలకు ఆ రాష్ట్ర ప్రజలు ఠారెత్తిపోతున్నారు. అభం శుభం తెలియని చిన్నారుల నుంచి యుక్త వయస్కులైన, మధ్య వయస్కులైన మహిళలపై లైంగిక వేధింపులు, హత్యలు, దారుణాలు భయోత్పాతం కల్పిస్తున్నాయి.

తమిళనాడు కృష్ణగిరి జిల్లాలో ముగ్గురు పాఠశాల గురువులు, ఆ స్కూల్లో చదువుతున్న అభం శుభం ఎరుగని పదమూడేళ్ల బాలికపై అఘాయిత్యానికి తలపడి లైంగిక వేధిపులకు పాల్పడ్డారు. నిందితులను పిల్లల రక్షణ ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసినట్టు పోలీసు అధికారులు, ఇతర శాఖల అధికారుల చెప్పారు. నిందితుల సస్పెన్షన్లు, అరెస్ట్ లు చేయడం బాగానే ఉంది. ఈ తరహా అరెస్టయిన వాళ్లు ఎందరు కఠిన శిక్షలకు గురయ్యారు, ఎందరు అమాయక బాధితులకు న్యాయం జరిగింది… అంటే ఈ ప్రశ్నకు సమాధానం ఉండదు. ఇదేరీతిలో ఇటీవల అన్నా యూనివర్సిటీలో ఓ యువతి లైంగిక వేధింపులకు గురైంది. వర్సిటీ లో డిగ్రీ కోర్స్ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై క్యాంపస్ లో ఇద్దరు కామాంధులు లైంగిక దాడికి దిగారు.

తాజాగా ఓ అతి హేయమైన ఘటన జరిగింది. ఈ ఘటనతో మహిళలకు ఎక్కడా రక్షణ లేదని అనిపిస్తోంది. పట్టపగలు రైల్లో తనకంటే పదేళ్లు పెద్దదైన మహిళపై ఓ నరాధముడు, కామాంధుడు లైంగిక వేధింపులకు దిగాడు. ఆమె ప్రతిఘటించడంలో రైల్లోంచి కిందకి తోసేశాడు. ఈ నేరగాడు ఇదివరలో ఎన్నో నేరాలు చేసి..జైళ్లకు వెళ్లి వచ్చి.. తిరిగి తన పశు ప్రవృత్తి ప్రదర్శిస్తున్నాడు. తమిళనాడు కొయంబత్తూర్ జిల్లాలో ఉదయం పది గంటల వేళ ఓ గర్భిణి తిరుప్పూర్ నుంచి కోయంబత్తూరు, తిరుపతి ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ రైలులో ఏపీ చిత్తూరుకు బయల్దేరింది. లేడిస్ కోచ్ లో ఎక్కింది. ఆమె రైలు ఎక్కినప్పుడు ఏడుగురు మహిళలు ఆ కోచ్ లో ఉన్నారు. అయితే, వాళ్ల, వాళ్ల స్టేషన్లు వచ్చినప్పుడు ఆ మహిళలు దిగిపోయారు. ఆమె ఒంటరిగా కంపార్ట్ మెంట్ లో ఉండగా హేమ్ రాజ్ అనే వ్యక్తి లేడీస్ కంపార్ట్ మెంట్ ఎక్కాడు. ఈ వ్యక్తి ఇదివరలో ఎన్నో నేరాలు, దారుణాలు చేసి జైలు శిక్ష అనుభవించి బయటకు వచ్చినట్టు పోలీసు రికార్డులు చెబుతున్నాయి.

లేడీస్ కంపార్ట్ మెంట్ లోకి జంట్స్ ఎక్కడం తప్పని నేరాలు, ఘోరాలు చేసే వాడికి ఎందుకు అనిపిస్తుంది. అసలు.. పాపపు పనికి పాల్పడాలనే కదా.. ఆ కంపార్ట్ మెంట్ లోకి ఎక్కింది. రైలు కదిలినప్పుడు ఆమెపై లైంగిక దాడికి దిగాడు. దీంతో భయపడిపోయినా ఆ గృహిణి..కేకలు పెడుతూ.. ఆ నేరగాడిని ప్రతిఘటించింది. దీంతో, అసుర ప్రవృత్తి గల ఆ కామాంధుడు.. ఆమెను కదిలే రైలునుంచి కిందకు తోసేశాడు. మహిళ కాళ్లు, చేతులు, తలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతోంది. బాధితురాలు తన పుట్టింటికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. హత్య, దోపిడీ కేసుల్లో అరెస్టయ్యి, జైలుకు వెళ్లిన ఈ నేరగాడు బెయిల్ మీదే వచ్చాడో, పారిపోయే వచ్చాడో, ఏ నాయకుడు ప్రోద్బలంతో బయటకు వచ్చాడో….తెలియదు కాని.. తిరిగి ఓ లైంగిక దాడికి, హత్యకు ప్రయత్నించాడు. కరుడు కట్టిన నేరగాళ్లు, యావజ్జీవ శిక్షలు పడిన వాళ్లు ఏ క్షమాభిక్షలతోనో బయటకు వచ్చేస్తున్నారు, మరి లైంగిక వేధింపులకు గురైన వాళ్లు, తీవ్ర గాయాలతో దివ్యాంగులుగా మారిన వారికి ఏం న్యాయం, ఎవరు చేస్తారు. నిష్కారణంగా ప్రాణాలు పోగుట్టుకున్నవాళ్ల ప్రాణాలు తిరిగి రప్పించగలరా..? వంద నేరాలు, వెయ్యి నేరాలు చేసి ఓ నేరగాడు తప్పించుకున్నా.. ఓ నిర్దోషికి శిక్ష పడకూడదని అందరూ చెబుతారు. ఇది నిజమే..అయితే, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నది ఏమిటి…? నిజమైన నిందితుడు నిక్షేపంలా కాలరెగరేసుకు తిరుగుతుంటే, బాధితులు భయం భయంగా బతకాల్సి వస్తోంది. ఎంతవరకు నిజమో తెలియదు కాని.. సింగపూర్ లో జీరో క్రైం రేటు అంటారు. ఎందుకు అంటే అక్కడి నేరస్థులకు కఠిన శిక్షలు ఉన్నందువల్ల అని చెబుతారు. ఇప్పటికైనా పాలకులు, అధికారులు, ప్రజలు అందరూ సమష్టి నిర్ణయాలతో…తప్పు చేసిన వారు తనవారైనా, పరాయి వారైనా.. జస్టీస్ చౌదరి తీర్పు మాదిరి ఉండేలా చూసి, ఏ దోషిని వదిలిపెట్టకుండా, ఒక్క నిర్దోషికి శిక్ష పడకుండా ఉండేలా.. అందరూ ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్