మనుషుల మధ్య మృగాలు తిరుగుతున్నాయి. కామంతో కళ్లు మూసుకుపోయి చిన్నారులు, మైనర్లు అని కూడా చూడకుండా తెగబడుతున్నాయి. మనిషి తోలు కప్పుకుని మృగంలా ఆడవాళ్ల మీద అత్యాచారాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువులు దగ్గర నుంచి స్కూల్‌లో పనిచేసే సిబ్బంది వరకు పిల్లలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారు. ఆడపిల్లలను బయటకు పంపించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి తెచ్చారు. వారికి భూమి మీద ఎక్కడా రక్షణ లేకుండాపోయింది. హైదరాబాద్‌లో జరిగిన పలు ఘటనలే ఇందుకు నిదర్శనం
బాలికపై సామూహిక అత్యాచారం
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్ షో కోట్‌లో గ్యాంగ్ రేప్ కలకలం రేపింది. మైనర్ బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికతో కలిసి ఇంటర్ చదుతున్న తోటి విద్యార్థులు ఈ ఘోరానికి పాల్పడినట్టు తెలుస్తోంది. సెప్టెంబర్ లో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెప్టెంబర్ నుంచి నిందితులు పరారీలో ఉన్నారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
విద్యార్థినిలపై ప్రిన్సిపాల్ లైంగిక వేధింపులు
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇలాంటి ఘటనే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇబ్రహీంపట్నం లయోలా పాఠశాల ప్రిన్సిపాల్ … విద్యార్థినిపై అత్యాచార యత్నం చేశాడు. ఈ మేరకు పోలీసులు ప్రిన్సిపాల్‌పై పోక్సో కింద కేసు నమోదు చేశారు. విద్యార్థిని పై అఘాత్యానికి పాల్పడిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలంటూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. ఇదిలా ఉంటే గతంలోనూ ప్రిన్సిపాల్‌పై ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. గతంలో విద్యార్థిని తల్లితండ్రులు దేహశుద్ధి చేసిన సంఘటనలు కూడా లేకపోలేదు. అయినా ప్రిన్సిపాల్‌లో ఎలాంటి మార్పు రాలేదు. వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని ఉంటే వెలుగులోకి రాని సంఘటనలు ఇంకెన్నో ఉన్నాయని అంటున్నారు. ఎంత మంది ఈ కామ పిశాచికి బలయ్యారో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థినిలను లొంగతీసుకుని అత్యాచారం చేసినట్టుగా ఆరోపణలు కూడా వచ్చాయి. పాఠశాల అనుమతిని రద్దు చేసి తక్షణమే ప్రిన్సిపాల్‌ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
ఆరేళ్ల బాలిక పట్ల స్కూల్ డ్రైవర్ అసభ్యకర ప్రవర్తన
శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇన్ ఫ్రంట్ జీసస్ స్కూల్‌లో దారుణం జరిగింది. ఫస్ట్ క్లాస్ చదువుతున్న ఆరేళ్ల విద్యార్థినిపై అదే స్కూల్లో బస్సు డ్రైవర్ గా పనిచేస్తున్న జోసెఫ్ రెడ్డి అనే వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో స్కూల్ వద్దకు తల్లిదండ్రులు ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ విద్యార్థి నాయకులు చేరుకున్నారు. బాలిక కుటుంబ సభ్యులు, ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. పోలీసులు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు న్యాయం చేయాలంటూ బాధిత తల్లిదండ్రులు పోలీసులను వేడుకున్నారు.
9ఏళ్ల బాలికపై అత్యాచారం
వికారాబాద్ జిల్లాలోనూ ఇలాంటి దారుణ ఘటన వెలుగుచూసింది. మూడో తరగతి చదువుతున్న తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగినట్టు తెలుస్తోంది. బురాన్ పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలిక చదువుతోంది. జంగయ్య అనే వ్యక్తిపై పోలీసులు పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసి .. అతనిని కోర్టులో హాజరుపరిచారు.