బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను వసూళ్లకు సంబంధించి కీలక గణాంకాలను ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ రెండు రాష్ట్రాల నుంచి కలిపి సుమారు రూ.20 వేల కోట్ల ఆదాయపు పన్ను వసూలైనట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. భారత మాజీ క్రికెట్ జట్టు కెప్టెన్, లెజెండరీ క్రికెటర్ ఎంస్ థోనీ( MS Dhoni) బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడిగా ఉన్నారని అధికారులు వెల్లడించారు.
బిహార్-జార్ఖండ్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్‌ట్యాక్స్ డాక్టర్ డి. సుధాకరరావు పలు కీలక వివరాలను వెల్లడించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బిహార్, జార్ఖండ్‌ల నుంచి మొత్తం రూ.20 వేల కోట్ల మేర ఆదాయపు పన్ను వసూళ్లు జరిగాయని… అందులో జార్ఖండ్ నుంచే సుమారు రూ.12 వేల కోట్లు వచ్చాయని తెలిపారు. మొత్తం పన్ను వసూళ్లలో దాదాపు 70 శాతం టిడిఎస్ రూపంలోనే వచ్చినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా సుధకార్రావు మాట్లాడుతూ.. గత ఆర్థిక సంవత్సరంలో బిహార్, జార్ఖండ్ రాష్ట్రాలను కలిపితే అందులో ఎంఎస్ ధోనీనే అత్యధిక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుడు అని తెలిపారు. అయితే ధోనీ చెల్లించిన పన్ను మొత్తం వివరాలను వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత కూడా ధోనీ వివిధ వ్యాపారాలు, బ్రాండ్ ఎండార్స్మెంట్లు, పెట్టుబడుల ద్వారా భారీ ఆదాయం పొందుతున్నట్లు తెలిసిందే.
కార్పొరేట్ రంగంలో కూడా కొన్ని ప్రముఖ ప్రభుత్వ సంస్థలు అత్యధిక పన్నులు చెల్లించాయని అధికారులు తెలిపారు. ముఖ్యంగా సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్( Central Coalfields Limited), భరత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ ( Bharat Coking Coal Limited), CMPDI వంటి సంస్థలు భారీగా పన్నులు చెల్లించినట్లు అధికారులు వెల్లడించారు. జార్ఖండ్‌లో గనుల ఆధారిత పరిశ్రమలు అధికంగా ఉండటంతో అక్కడి నుంచి అధిక పన్ను వసూళ్లు నమోదైనట్లు చెబుతున్నారు.
అయితే గత ఆర్థిక సంవత్సరంలో భారీ వర్షాల కారణంగా మైనింగ్ కార్యకలాపాలు కొంత మేర ప్రభావితమయ్యాయని … దాంతో పన్ను వసూళ్లపై కూడా ప్రభావం పడిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల మార్కును దాటే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది.
బిహార్, జార్ఖండ్‌లలో కలిపి సుమారు 5.5 కోట్ల మంది పాన్‌కార్డు దారులు ఉన్నప్పటికీ, వారిలో కేవలం 40 లక్షల మంది మాత్రమే ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారని అధికారులు వెల్లడించారు. పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.
ఆరు దశాబ్దాల నాటి 1961 ఆదాయపు పన్ను చట్టం స్థానంలో ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త 2025 ఆదాయపు పన్ను చట్టానికి సంబంధించి అంతకుముందు సుధాకర్ రావు ఐటీ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల నుంచి 100 మందికి పైగా అధికారులు పాల్గొన్నారు.
కొత్త చట్టం ద్వారా పన్ను విధానంలో పెద్ద మార్పులు లేనప్పటికీ… పన్ను చెల్లింపుదారులకు మరింత స్పష్టత, సులభతరం చేసే విధంగా చట్టాన్ని రూపొందించినట్లు అధికారులు చెబుతున్నారు. సులభమైన , సరళమైన భాష, ప్రజలకు అర్థమయ్యే విధంగా చట్టాన్ని రూపొందించడం ప్రధాన లక్ష్యమని వివరించారు.
కొత్త ఆదాయపు పన్ను చట్టంపై బ్యాంకర్లు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, వ్యాపార వర్గాలు, సాధారణ ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బిహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో విస్తృత స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది.


