35.2 C
Hyderabad
Friday, May 8, 2026
spot_img

మధ్యతరగతి కుటుంబాలకు రూఫ్‌టాప్‌ సోలార్‌ ప్రయోజనకరమేనా? నిపుణులు ఏం చెబుతున్నారు?

దేశంలో విద్యుత్‌ ఛార్జీలు పెరుగుతున్న వేళ… మధ్యతరగతి కుటుంబాలు ఇప్పుడు ఎక్కువగా ఆలోచిస్తున్న అంశం రూఫ్‌టాప్‌ సోలార్‌. ఒకప్పుడు పర్యావరణ పరిరక్షణ కోణంలో మాత్రమే చూసిన సోలార్‌ వ్యవస్థ… ఇప్పుడు నేరుగా డబ్బు ఆదా చేసే పెట్టుబడిగా మారుతోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నెలకు భారీగా కరెంట్‌ బిల్లులు చెల్లిస్తున్న కుటుంబాలకు ఇది లాభదాయకమా? అనే చర్చ జోరుగా సాగుతోంది.

సోలార్‌ రంగ నిపుణుల అభిప్రాయం ప్రకారం… ప్రస్తుతం భారతదేశంలో రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థల ఆర్థిక లాభాలు గణనీయంగా పెరిగాయి. పెరుగుతున్న విద్యుత్‌ ఛార్జీలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సబ్సిడీలు, తగ్గుతున్న సోలార్‌ ప్యానెల్‌ ధరలు… ఇవన్నీ కలిపి ఇప్పుడు సోలార్‌ను మధ్యతరగతికి మరింత అందుబాటులోకి తీసుకువస్తున్నాయి.

సోలార్‌ స్క్వేర్‌ సీఈవో, కో ఫౌండర్‌ శ్రేయా మిశ్రా మాట్లాడుతూ… మన దేశంలో సాధారణంగా రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలు 3 నుంచి 5 సంవత్సరాల్లో పెట్టిన పెట్టుబడిని తెచ్చేస్తాయి. ఆ తర్వాత మరో 20 నుంచి 22 సంవత్సరాల పాటు దాదాపు ఉచిత విద్యుత్‌ను పొందవచ్చని అన్నారు.

సాధారణంగా పట్టణ మధ్యతరగతి కుటుంబాలు నెలకు 300 నుంచి 500 యూనిట్ల వరకు విద్యుత్‌ను వినియోగిస్తాయి. అలాంటి కుటుంబాలు ఎక్కువగా 3 కిలోవాట్ల నుంచి 5 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న సోలార్‌ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుంటున్నాయి.

సోలార్‌ కంపెనీల అంచనాల ప్రకారం…

1 కిలోవాట్‌ సోలార్‌ వ్యవస్థ సంవత్సరానికి సుమారు 1400 నుంచి 1450 యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. 3 కిలోవాట్‌ వ్యవస్థ ఏడాదికి 4,200 నుంచి 4,350 యూనిట్లు ఉత్పత్తి చేయగలదు. 5 కిలోవాట్‌ వ్యవస్థ ఏడాదికి 7,000 నుంచి 7,250 యూనిట్లు ఉత్పత్తి చేస్తుంది.

ఉదాహరణకు ఒక కుటుంబం నెలకు 400 యూనిట్ల విద్యుత్‌ వినియోగిస్తోందని అనుకుంటే… ప్రస్తుత టారిఫ్‌ ప్రకారం సంవత్సరానికి దాదాపు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు కరెంట్‌ బిల్లు చెల్లించాల్సి వస్తోంది. విద్యుత్‌ ధరలు భవిష్యత్తులో ఇంకా పెరిగితే… 25 సంవత్సరాల్లో ఈ మొత్తం రూ.10 లక్షలకు మించి వెళ్లే అవకాశం ఉంది.

అయితే రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థ వల్ల ఈ భారీ ఖర్చులో చాలా భాగం ఆదా అవుతుందని సోలార్‌ కంపెనీలు పేర్కొంటున్నాయి. ఇప్పటి వరకు సోలార్‌ వ్యవస్థను ఏర్పాటు చేయాలంటే ఎక్కువ ఖర్చు అవుతుందని ఆలోచించేవారు. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పీఎం సూర్యాఘర్‌(PM Surya Ghar), ముఫ్త్‌ బిజిలీ యోజనా( Muft Bijli Yojana) పథకం కారణంగా పరిస్థితి మారుతోంది. ఈ పథకం కింద గృహ వినియోగ రూఫ్‌టాప్‌ సోలార్‌ వ్యవస్థలకు రూ.78 వేల వరకు సబ్సిడీ లభిస్తోంది.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అదనపు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ రాష్ట్రాలు రూ.30 వేల వరకు అదనపు సబ్సిడీని అందిస్తున్నాయి. అలాగే అసోం రాష్ట్రం రూ.45 వేల వరకు సబ్సిడీ ఇస్తోంది. ఈ సబ్సిడీల వల్ల మధ్యతరగతి కుటుంబాలపై పడే ప్రారంభ భారం గణనీయంగా తగ్గుతోంది.

జాక్సన్ గ్రూప్‌లోని సోలార్ మాడ్యూల్స్ , సెల్స్ వ్యాపార విభాగ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ , సీఈఓ గగన్ చనానా మాట్లాడుతూ… సోలార్‌ పరికరాల ధరలు తగ్గడంతో ఇప్పుడు గృహాల కోసం సోలార్‌ వ్యవస్థలు మరింత అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రస్తుతం సోలార్‌కు మారడానికి ఇదే సరైన సమయమని అన్నారు.

సోలార్‌ పెట్టుబడిలో అత్యంత కీలకమైన అంశం పేబ్యాక్‌ పీరియడ్‌. అంటే… పెట్టిన పెట్టుబడి ఎన్ని సంవత్సరాల్లో తిరిగి వస్తుంది అనేదే కీలంగా మారింది. ప్రస్తుతం చాలా ఇళ్లలో 4 నుంచి 5 సంవత్సరాల మధ్యలోనే పెట్టుబడి తిరిగి వస్తోందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ దాదాపు ఉచితమే. కేవలం చిన్నపాటి మెయింటెనెన్స్‌ ఖర్చులు మాత్రమే ఉంటాయి. అందుకే దీన్ని చాలా మంది దీర్ఘకాలిక ఆదా చేసే ఆస్తిగా చూస్తున్నారు.

అయితే నిపుణులు చెబుతున్న మాటలు ఏంటంటే… చవక ధరకు మాత్రమే ఆకర్షితులవకుండా… నాణ్యమైన పరికరాలు, సరైన ఇన్‌స్టాలేషన్‌, మంచి సర్వీస్‌ కలిగిన సంస్థలను ఎంచుకోవాలని సూచిస్తున్నారు.

ఇన్‌స్టాలేషన్‌ ముందు ఇంటిపై పడే నీడ, ప్యానెల్‌ల మన్నిక, మౌంటింగ్‌ స్ట్రక్చర్‌ నాణ్యత వంటి అంశాలు తప్పనిసరిగా పరిశీలించాలన్నారు. అలాగే ప్రభుత్వ ALMM ఆమోదం ఉన్న సోలార్‌ మాడ్యూల్స్‌ వాడుతున్నారా? అనే విషయాన్ని కూడా చూసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.

వర్షాకాలంలో సోలార్‌ పనిచేస్తుందా?

ఈ అనుమానం చాలా మందిలో ఉంటుంది. కానీ నిపుణుల ప్రకారం… వార్షిక విద్యుత్‌ ఉత్పత్తి లెక్కల్లో ఇప్పటికే మాన్సూన్‌ ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. వర్షాకాలంలో ఉత్పత్తి తగ్గినా… వేసవిలో అధిక ఉత్పత్తి ద్వారా అది సమతుల్యం అవుతుంది.

అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏంటంటే… భవిష్యత్తులో విద్యుత్‌ టారిఫ్‌లు పెరిగినా… ఇప్పటికే సోలార్‌ ఏర్పాటు చేసుకున్న కుటుంబాలపై దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఇది కేవలం విద్యుత్‌ ఉత్పత్తి చేసే వ్యవస్థ మాత్రమే కాదు… భవిష్యత్తు ఖర్చులను నియంత్రించే ఒక దీర్ఘకాలిక ఆర్థిక రక్షణగా కూడా నిపుణులు భావిస్తున్నారు.

Latest Articles

ప.బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి…రేపే ప్రమాణ స్వీకారం

పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో భారీ మార్పుకు తెరలేచింది. బెంగాల్‌లో తొలిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతోంది. కీలక రాజకీయ పరిణామాల మధ్య బీజేపీ హైకమాండ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారిని ప్రకటించింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్