తెలంగాణ అసెంబ్లీలో తీవ్ర గందరగోళం నెలకొంది. మాజీ మంత్రి సబిత తనను మోసం చేశారని ఆరోపించారు సీఎం రేవంత్. 2019 ఎన్నికల్లో తనకు అండగా ఉంటానని సబిత హామీ ఇచ్చి మాట తప్పారని అన్నారు. తనకు టికెట్ ఇచ్చిన వెంటనే కేసీఆర్ మాటలు నమ్మి బీఆర్ఎస్‌లో చేరారని చెప్పారు. అధికారం కోసం సబిత బీఆర్ఎస్‌లో చేరి మంత్రి పదవులు అనుభవించారన్నారు. తమ్ముడు లాంటి తనను మోసం చేశారు కాబట్టే కేటీఆర్‌ను నమ్మవద్దని చెప్పానన్నారు.
అయితే సీఎం రేవంత్ రెడ్డికి తనపై కక్ష ఎందుకని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. కేటీఆర్‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు సరికాదన్నారు. వెనుక కూర్చున్న అక్కలను నమ్ముకోవద్దు.. మోసం చేస్తారని కేటీఆర్‌ను ఉద్దేశించి ముఖ్యమంత్రి అనడం సరికాదన్నారు. తాము ఏం మోసం చేశాం.. ఎవరిని ముంచామో చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మంచి మనసుతో ఆయనను ఆహ్వానించానన్నారు. ఓ ఆడబిడ్డపై ఇలాంటి మాటలు ఏమిటన్నారు. తమపై సీఎం చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించకోవాలని డిమాండ్ చేశారు.