దిగ్గజ ఇండియన్ క్రికెటర్, మాజీ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ .. బెంగళూరు వీధిలో ఆటో రిక్షా డ్రైవర్‌తో గొడవ పడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ వీడియోని అటు పక్కగా వెళ్తున్న ఓ వ్యక్తి చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. స్థానిక కన్నడ భాషలో డ్రైవర్‌తో ద్రావిడ్ వాదిస్తున్నట్లుగా వీడియోలో కనిపిస్తోంది. ద్రావిడ్ కారు.. సరుకుతో వెళ్తున్న ఆటోతో ఢీకొట్టింది. దీంతో ద్రావిడ్ , ఆటో డ్రైవర్‌తో గొడవ పడుతున్నాడు. అయితే రాహుల్ ద్రావిడ్ కారును ఎవరు నడుపుతున్నారనేది తెలియరాలేదు.
ఈ యాక్సిడెంట్ బెంగళూరులోని బిజీగా ఉండే కన్నిన్‌ఘమ్ రోడ్డులో జరిగింది. స్థానిక సమాచారం ప్రకారం ద్రావిడ్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ జంక్షన్ నుంచి హై గ్రౌండ్స్‌కు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆటో డ్రైవర్ ద్రావిడ్ కారు మీదకి పోనిచ్చినట్టు సమాచారం. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. అయితే అక్కడి నుంచి వెళ్లడానికి ముందు ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్‌ను ద్రావిడ్ తీసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు.
రాహుల్ ద్రావిడ్ ఆటో డ్రైవర్‌తో వాడీ వేడీగా వాదనలు చేస్తున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వాదనలు జరుగుతున్నప్పుడు వాహనాల బ్రేక్‌ల గురించి మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.
ఎక్స్‌లో టైమ్స్ ఆఫ్ ఇండియా పోస్ట్ ప్రకారం.. వాహనాలు ఢీకొన్న తర్వాత ప్రమాదం, వాదనలు జరిగాయని తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో రెండు వాహనాల్లో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి గాయాలు కాలేదు.
ఈ ఘటన మంగళవారం సాయంత్రం 6.30 సమయంలో జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి కేసు ఫైల్ కాలేదు. అలాగే ఘటనాస్థలి నుంచి వెళ్లడానికి ముందు ఆటో డ్రైవర్ ఫోన్ నెంబర్, ఆటో రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకున్నారు రాహుల్ ద్రావిడ్.
రాహుల్ ద్రావిడ్(52)భారతదేశంలో అత్యుత్తమమైన బ్యాటర్లలో ఒకరు. వన్డే, టీ20, టెస్టు మ్యాచుల్లో 24వేల పరుగులు సాధించారు. ద్రావిడ్ 2007 ప్రపంచ కప్‌లో టీమిండియాకు నాయకత్వం వహించాడు.
భారతీయ జట్టుతో ద్రావిడ్ ప్రధాన కోచ్‌గా కూడా వ్యవహరించాడు. భారతదేశం టీ20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను గెలిచిన తరువాత జూలైలో అతని పదవీకాలం ముగిసింది.
ఆ టోర్నమెంట్ తరువాత, ద్రవిడ్ మాజీ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ఫ్రాంచైజ్ రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) కు తిరిగి వచ్చాడు. ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
అతను ఐపిఎల్ 2025 మెగా వేలంలో ఆర్‌ఆర్‌తో వైపు ఉన్నాడు. ఆక్షన్ చరిత్రలో అతి పిన్న వయస్కుడైన 13 ఏళ్ల వైభవ్ సూర్యవాన్షి కొనుగోలు చేసిన టీమ్‌గా వార్తల్లో నిలిచింది.