గత ప్రభుత్వం మానవ విపత్తులను సృష్టించిందని.. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి చింతించాల్సిన అవసరం లేదన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మూడింతల సాయాన్ని కేంద్రం అందిస్తోందన్నారు. రాష్ట్రాన్ని గాడిన పెట్టడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారని చెప్పారు. ఈ ఏడు నెలల్లోనే 3 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయని తెలిపారు.
విజయవాడ నగరానికి సమీపంలోని కొండపావులూరులో 20వ ఎన్డీఆర్‌ఎఫ్ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్రహోమంత్రి అమిత్‌షా, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ (NIDM) ప్రాంగణాన్ని అమిత్‌షా ప్రారంభించారు.
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. తెలుగులో మాట్లాడలేకపోతున్నందుకు క్షమాపణ కోరుతున్నానని అన్నారు. ఏపీలో అనూహ్యమైన విజయాన్ని అందించినందుకు ధన్యవాదాలు తెలిపారు అమిత్‌షా. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడంలో ఎన్డీఆర్‌ఎఫ్ ముందుంటుందని చెప్పారు. అదే విధంగా మానవ విపత్తుల నుంచి కాపాడటంలో ఎన్డీయే ప్రభుత్వం ముందుంటుందని అన్నారు.
“గత ప్రభుత్వం మానవ విపత్తులను సృష్టించింది. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి చింతించాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మూడింత సాయాన్ని కేంద్రం అందిస్తోంది. ఈ ఏడు నెలల్లోనే ఏపీకి రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. విశాఖ స్టీల్ ప్లాంట్‌కు రూ.11, 440 కోట్లు సాయం అందించాం. స్టీల్ ప్లాంట్ అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడంలో ఇది ఉపయోగపడుతుంది. అమరావతి నిర్మాణానికి కేంద్రం సహకరిస్తోంది. హడ్కో ద్వారా అమరావతికి రూ. 27వేల కోట్ల సాయం అందించాం. విశాఖ రైల్వే జోన్ కూడా పట్టాలెక్కించాం. రూ.2 లక్షల కోట్లతో విశాఖలో గ్రీన్ హైడ్రోజన్ జోన్., రూ. లక్షా 20వేల కోట్లతో మౌలిక వసతుల కల్పన జరుగుతుంది. 2028 నాటికి రాష్ట్రంలో పోలవరం నీళ్లు పారిస్తాం. అమరావతిని గత ప్రభుత్వం విస్మరించింది”.. అని అమిత్ షా చెప్పారు.