ఆంధ్రప్రదేశ్‌కు జీవనాడి పోలవరం. అయితే పోలవరం ఇప్పటిది కాదు. కొన్ని దశాబ్దాలుగా కొనసాగు తోంది పోలవరం గాథ. పోలవరం ప్రయాణం అంత సులభంగా జరగలేదు. ఈ ప్రయాణంలో అనేక అభ్యంతరాలు, అవరోధాలు వచ్చాయి. ఈ ఒడిదుడుకులను తట్టుకుంటూ ఇప్పటికీ పోలవరం పయనం సాగుతూనే ఉంది.
గోదావరి నదిపై ప్రాజెక్ట్ నిర్మించాలన్న ఆలోచనకు కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. 1941లో పోలవరం సమీపాన గోదావరి నదిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి నీటిపారుదల అధికారులు ప్రతి పాదనలు సిద్దం చేశారు. ఈ ప్రతిపాదన లను పరిశీలించాక, ఒక నివేదికను రూపొందించారు. ఈ నివేదిక ఆధారంగా ఒక ప్రాజెక్ట్ రూపొందించారు. ఆ ప్రాజెక్ట్‌కు రామపాద సాగర్ అంటూ పేరు పెట్టారు. పేరు పెట్టడమే కాదు. రామపాద సాగర్ ప్రాజెక్ట్ డిజైన్ పై కూడా శ్రద్ధ పెట్టారు అధికారులు. అయితే నిర్మాణపరంగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇందుకు ప్రధానంగా రెండు కారణా లున్నాయి. మొదటి కారణం. ప్రాజెక్ట్ నిర్మాణానికి అయ్యే ఖర్చు భారీగా ఉండటం. ఇక రెండో కారణం, నిర్మాణంలో ఉన్న సంక్షిష్టత. ఇదిలా ఉంటే, 1953లో గోదావరికి వరదలు వచ్చాయి. ఎంతో నీరు వృథాగా సముద్రంలోకి పోయింది. మరో వైపు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నీటి అవసరాలు అంతకంతకూ పెరిగాయి. ఈ నేపథ్యంలో గోదావరి నదిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదన మళ్లీ తెరమీదకు వచ్చింది. ఇందులో భాగంగా నీటి అవసరాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి.
1976లో పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్దం చేశారు. పూర్తి నీటి మట్టం 150 అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం ఉండాలన్నది ఒక ప్రతిపాదన. అలాగే స్పిల్‌వే సామర్థ్యం 36 లక్షల క్యూసెక్కులు ఉండాలన్నది మరో ప్రతిపాదన. పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిశా, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ముంపునకు గురవుతున్న ప్రాంతాలకు తగిన నష్టపరిహారం ఇవ్వాల న్నది ఇంకో ప్రతిపాదన. బచావత్ ట్రైబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్ట్‌కు సంబం ధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి. పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశాలు 1980 ఏప్రిల్ రెండో తేదీన ఒక ఒప్పందం చేరుకున్నాయి. ఇదిలా ఉంటే 1981లో పోలవరం ప్రాజెక్ట్‌కు అప్పటి ముఖ్యమంత్రి అంజయ్య శంకుస్థాపన చేశారు. అనేక రకాల పరిశీలనల తరువాత 1986లో ప్రాజెక్ట్‌కు సంబంధించి తుది నివేదికను రూపొందించారు. ఆ తరువాత కొంతకాలంపాటు పోలవరం ప్రాజెక్ట్ అంశం మరుగునపడింది. పోలవరం ప్రాజెక్ట్‌ను దాదాపుగా అందరూ మరచిపోయారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చాలా సంక్లిష్టమైనది. సహజంగా ప్రాజెక్టులను నదులపై నిర్మిస్తారు. అయితే పోలవరం ప్రాజెక్ట్ పూర్తిగా భిన్నం. గోదావరి నది మీద కాకుండా నదికి పక్కన నిర్మాణం చేపట్టారు. గోదావరి నది కింద ఇసుక ఎక్కువగా ఉంది. దీంతో ఇసుకలో ప్రాజెక్ట్ నిర్మించడం సాంకేతికంగా శ్రేయస్కరం కాదని నీటిపారుదలరంగ నిపుణులు సలహా ఇచ్చారు. నిపుణుల సలహామేరకు నది పక్కన నిర్మాణం చేపట్టారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని ఒక గ్రామం దగ్గర ఈ నిర్మాణాన్ని చేపట్టారు. పోలవరం ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. మొదటి భాగం రిజర్వాయర్. రెండోది స్పిల్ వే. మూడోది విద్యుత్ ఉత్పత్తి కేంద్రం. రిజర్వాయర్‌లో నీటిని నిల్వ చేస్తారు. ఇందులో మరో కీలక భాగం స్పిల్ వే. రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేయడానికి స్పిల్ వే ఉపయోగ పడుతుంది. ఈ స్పిల్ వేను రెండు కొండల మధ్య నిర్మిస్తున్నారు. కాగా రిజర్వాయర్‌కు రెండు కాలువలు ఉంటాయి. ఒకటి కుడివైపు కాలువ కాగా రెండోది ఎడమవైపు కాలువ. రిజర్వాయర్ నుంచి ఈ కాలువల ద్వారా నీటిని తరలిస్తారు.
రిజర్వాయర్ ఆనకట్టలో అనేక భాగాలున్నాయి. ఇందులో మొదటిది డయాఫ్రం వాల్. నది మధ్యలో దాదాపు 300 అడుగుల లోతులో నిర్మించిన కాంక్రీట్ గోడే డయాఫ్రం వాల్. రిజర్వాయర్ నుంచి నీరు లీకేజీ కాకుండా డయాఫ్రం వాల్ కాపాడుతుంది. డయాఫ్రం వాల్‌కు ఇరువైపులా రాతి, మట్టితో ఒక కట్టడం ఉంటుంది. దీనినే ఎర్త్ కం రాక్ ఫిల్ డ్యాం అంటారు . పోలవరం ప్రాజెక్ట్ కీలకమైన భాగం కాఫర్ డ్యాం. దీనిని ఒక ప్రధానమైన కట్టడంగా చెప్పవచ్చు. ప్రధానమైన డ్యాంను నిర్మించేటప్పడు నీరు అడ్డు తగలకుండా ఉండటానికి తాత్కాలికంగా నిర్మించే కట్టడమే కాఫర్ డ్యాం. పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యాంలున్నాయి. నదీ ప్రవాహానికి అడ్డు రాకుండా ఎగువన ఒక కాఫర్ డ్యాం ఉంటుంది. అలాగే ధవళేశ్వరం బ్యారేజీ బ్యాక్ వాటర్‌కు అవరోధం కలిగించకుండా దిగువన మరో కాఫర్ డ్యాం ఉంటుంది.


