ప్రవాస భారతీయులు ఎప్పుడూ దేశానికి బలమైన బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. అమెరికాలోని భారతీయుల నైపుణ్యాలు, నిబద్ధత సాటిలేనివని.. వారు ఇరు దేశాలను అనుసంధానించినట్టు చెప్పారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. న్యూయార్క్ వేదికగా నిర్వహించిన మోదీ అండ్ యూఎస్ – ప్రోగ్రెస్ టు గెదర్ .. కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.
తాను ఎటువంటి పదవుల్లో లేని సమయంలోనే అగ్రరాజ్యంలోని దాదాపు 29 రాష్ట్రాల్లో పర్యటించినట్టు ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు. ప్రధానిగా అమెరికా పర్యటనల్లో భాగంగా ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన కార్యక్రమాలను ప్రస్తావించారు. ఇక్కడి భారతీయులు ప్రతిసారీ పాత రికార్డులను చెరిపేశారని చెప్పారు.
భారత్ డిజిటల్ విప్లవాన్ని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు,. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా UPI, 5G నెట్‌వర్క్ అమలు తీరును ఆయన ప్రశంసించారు. 5జీ నెట్ వర్క్ అమలులో అమెరికా కంటే భారత్ ఎంతో ముందుందని చెప్పారు. డిజిటల్ వ్యాలెట్స్‌ను భారతీయులు ఇప్పుడు ఉపయోగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థ UPI భారత్‌లో ఉందని అన్నారు.
ఇండో అమెరికన్ కమ్యూనిటీ ఆఫ్ USA ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు దేవిశ్రీ ప్రసాద్ తదితరులు తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.