పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో రాబోయే మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. ఇవాళ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాలు.. కోస్తాలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం.. రాయలసీమలోని కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని చెప్పారు.
నిన్న అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో వానలు కురిశాయి. అత్యధికంగా విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో 79.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. రెండు ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో.. పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలినచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. అంతేకాదు రాష్ట్రంలో అక్కడక్కడా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహన సంస్థ తెలిపింది.