SLBC ఘటనలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల నేతలతో కలిసి ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ సందర్శనకు వెళ్లనున్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డిపై పలు ఆరోపణలు చేశారు. ఎనుముల రేవంత్ రెడ్డి కాదని.. ఎగవేతల రేవంత్ రెడ్డి అంటూ ఆరోపించారు. అబద్దాలు మాట్లాడతాడు కాబట్టే ఆయన అబద్ధాల రేవంత్ రెడ్డి అయ్యారని ఎద్దేవా చేశారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ విషయంలో ఏజెన్సీల మధ్య సమన్వయం చేయడంలో కూడా ప్రభుత్వం దారుణంగా విఫలమైందని అన్నారు. ఘటన జరిగి ఇన్ని రోజులైనా సహాయక చర్యలు మొదలు కాలేదని ఆరోపించారు. మంత్రులు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో పోటీ పడుతున్నారే తప్ప.. హెలికాప్టర్ నుండి సొరంగంలో ఏం జరుగుతుందో తెలుస్తుందా? అని ప్రశ్నించారు. ఎంత తొందరగా సహాయక చర్యలు మొదలైతే అంత ఉపయోగకరంగా ఉంటుందని సూచించారు.
ప్రమాదం జరగడం దురదృష్టకరమన్న హరీశ్‌రావు.. ఘటన జరిగిన తర్వాత ప్రభుత్వ స్పందన కరువైందని ఆరోపించారు. ముఖ్యమంత్రికి ఎన్నికలు ముఖ్యమా? ఎనిమిది మంది ప్రాణాలు ముఖ్యమా? అని నిలదీశారు. సహాయక చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం, ముఖ్యమంత్రి సరైన డైరెక్షన్ ఇవ్వలేకపొతున్నారని సెటైర్లు వేశారు. ప్రభుత్వ ఫెయిల్యూర్ కప్పి పుచ్చుకోవడానికి తమపై నెపం నెడుతున్నారని హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
SLBC సందర్శన తర్వాత అన్ని విషయాలు మాట్లాడుతానని చెప్పారు మాజీ మంత్రి. SLBC కోసం కాంగ్రెస్ హయాంలో కంటే బీఆర్ఎస్ హయంలోనే ఎక్కువ నిధులు ఖర్చు చేశామని చెప్పారు. SLBC కోసం అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి 100 కోట్ల మోబిలైజేశన్ ఫండ్ ఇచ్చామని తెలిపారు. రేవంత్ రెడ్డి తన 15 నెలల పాలనలో 15 మీటర్లు కూడా సొరంగాన్ని తవ్వలేదని అన్నారు. రేవంత్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారని.. ప్రభుత్వ వైఫల్యం వల్ల ఎనిమిది మంది ప్రాణాలు గాలిలో ఉన్నాయని హరీశ్‌రావు అన్నారు.