మొదట టోక్యో.. ఇప్పుడు ప్యారిస్.. ప్లేస్ మారిందే కానీ ప్రతిభ మాత్రం తగ్గలేదు. రెండు వరుస ఒలింపిక్స్‌లలో అసాధారణ ప్రతిభతో రాణించాడు నీరజ్ చోప్రా. స్వతంత్ర భారతావని ఎరుగని సరికొత్త చరిత్ర లిఖించాడు. పారిస్ ఒలింపిక్స్‌లో రజతంతో సగర్వంగా నిలిచి 140 కోట్ల మంది భారతీయులను మురిసిపోయేలా చేశాడు.
టోక్యో ఒలింపిక్స్‌లో వచ్చిన విజయం గాలి వాటం కాదని నిరూపించాడు జావెలిన్ త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా. పారిస్ ఒలింపిక్స్‌లో తన సత్తా చాటాడు. కోట్లాదిమంది భారతీయుల కలలు మోసుకుంటూ ఒలింపిక్స్‌లో అడుగు పెట్టిన నీరజ్.. ప్రతి దశలోనూ మంచి ప్రదర్శన చేశాడు. ఫైనల్‌లోనూ అదరగొట్టాడు. పారిస్‌లో తనకు పోటీగా భావించే మేటి అథ్లెట్లను వెనక్కు నెట్టేస్తూ ఫైనల్‌లో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు చోప్రా. ఏకంగా 89.45 మీటర్ల దూరం బల్లేన్ని విసిరాడు. అయితే.. ఎవ్వరూ ఊహించని విధంగా పాకిస్థాన్ క్రీడాకారుడు నదీమ్ 92.97 మీటర్ల దూరంతో స్వర్ణాన్ని ఎగరేసుకుపోగా నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచి రజత పతకం సాధించాడు.
ఇప్పటిదాకా ఎప్పుడు 90 మీటర్ల దూరం బల్లేన్ని విసరని నీరజ్.. రెండో ప్రయత్నంలో తన అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఏకంగా 89.45 మీటర్ల దూరం విసిరాడు. అయితే.. గత ఒలింపిక్స్‌తో పోలిస్తే నీరజ్ ప్రతిభ, ప్రదర్శన మరింత మెరుగైంది. టోక్యో ఒలింపిక్స్‌లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణపతకం సాధించాడు నీరజ్. కానీ, ఈసారి అంతకంటే ఎక్కువే విసిరినా పాకిస్థాన్ క్రీడాకారుడు మరింత మెరుగైన ప్రదర్శన చేయడంతో చోప్రా రజతంతో సంతృప్తి పడాల్సి వచ్చింది. రజతం సాధించడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నీరజ్ చోప్రా. నదీమ్ ప్రదర్శన బాగా ఉందని పేర్కొన్నాడు. తాను కొన్ని విషయాల్లో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చాడు. ఇక, నీరజ్ పతకంతో అఖండ భారతావని మురిసిపోయింది. దేశ ప్రధాని మోడీ నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ శభాష్ అంటూ మెచ్చుకుంటున్నారు.