నాగబాబుకు మంత్రి పదవి వరించే అవకాశం లేదా? సీఎం చంద్రబాబు ఆయనకు వేరే బాధ్యతలు అప్పగించనున్నారా? అంటూ అవుననే సమాధానమే వస్తోంది. ఏపీలో కీలక రాజకీయ నిర్ణయం తీసుకునే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్న నాగబాబు విషయంలో సీఎం పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో రాజ్యసభ స్థానాన్ని ఆశించిన నాగబాబుకు బీజేపీ కారణంగా ఆ పదవి దక్కలేదు. అప్పుడే నాగబాబుకు మార్చిలో మంత్రి పదవి ఇస్తామని బుజ్జగించింది. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆలోచనలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.
మరి కొన్ని రోజుల్లో చంద్రబాబు మంత్రి వర్గ విస్తరణ చేస్తారని.. నాగబాబుకు అమాత్య పదవి వరిస్తుందని జనసైనికులు సంబరాల్లో మునిగిపోయారు.. వారి ఆశలపై నీళ్లు చల్లేలా మరో ప్రచారం జరుగుతోంది. నాగబాబు మంత్రి పదవి విషయంలో చంద్రబాబు పునరాలోచనలో పడ్డట్లు తెలిసింది. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి నాగబాబు క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసిన తర్వాత నాగబాబు కాస్త సైలెంట్ అయ్యారు. అయితే పవన్ కల్యాన్ జనసేన స్థాపించిన దగ్గర నుంచి ఆ పార్టీ కోసం పని చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించినా.. ఆ టికెట్ బీజేపీ తీసుకోవడంతో వెనక్కు తగ్గారు. ఇక రాజ్యసభ ఎంపీ పదవి వస్తుందని ఆశించినా.. మరోసారి బీజేపీ అడ్డుపడింది. అప్పుడే మంత్రిని చేస్తామని టీడీపీ లేఖ ద్వారా స్పష్టం చేసింది.
మరో పది పదిహేను రోజుల్లో మంత్రి వర్గ విస్తరణపై కసరత్తు మొదలవుతుందని భావిస్తుండగా.. చంద్రబాబు తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు గడిచిపోయింది. టీడీపీలో కీలక నేతలైన చంద్రబాబు, నారా లోకేశ్.. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాలనా వ్యవహారాల్లో బిజీగా మారిపోయారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షురాలు ఎంపీగా గెలవడంతో రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇలాంటి సమయంలో కూటమి పార్టీల నాయకుల మధ్య వచ్చే చిన్న చిన్న మనస్పర్థలు, విభేదాలు పరిష్కరించేందుకు టైం లేకుండా పోతోంది. మరోవైపు మూడుపార్టీలను సమన్వయం చేసే వ్యవస్థ కూడా లేదు. అందుకే ఒక కీలక నాయకుడికి ఈ బాధ్యతలు అప్పగించాలని చంద్రబాబు భావిస్తున్నారట.
టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య సమన్వయ బాధ్యతలు మొదట నారా లోకేశ్ కు అప్పగించాలని భావించారట. అయితే మంత్రిగా, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా లోకేశ్ బిజీగా ఉన్నారు. దీంతో నాగబాబుకు ఆ బాధ్యతలు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారట. మూడు పార్టీల మధ్య వారధిగా ఒక కీలకమైన పోస్టు సృష్టించి.. నాగబాబుకు అప్పగించనున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చంద్రబాబు ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట. ఇప్పటికే నాగబాబును మంత్రిని చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అందుకే ముందు పవన్ కల్యాన్ అభిప్రాయంతో పాటు నాగబాబు మనసులో ఏముందో కనుక్కోవాలని చంద్రబాబు భావిస్తున్నారట. అందుకే టీడీపీలోని కీలక నాయకులను రంగంలోకి దించారని.. వారు పవన్, నాగబాబుతో చర్చించనున్నట్లు తెలిసింది.
నాగబాబు ఆ పోస్టుకు ఒప్పుకుంటే.. మంత్రిగా కాకుండా ఎంపీగా ఛాన్స్ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. కూటమి సమన్వయానికి ఒక పెద్ద నాయకుడి అవసరం ఉండటంతో నాగబాబు అయితేనే దానికి న్యాయం చేస్తారని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఆయన్ను ఎలాగైనా ఒప్పించాలని టీడీపీ నాయకులకు చెప్పారట. ఒక వేళ మంత్రి పదవే కావాలని నాగబాబు డిమాండ్ చేస్తే.. ఇప్పుడు కాకుండా.. భవిష్యత్‌లో ఇస్తామనే ప్రతిపాదన కూడా చేస్తున్నారట. అయితే ఈ విషయంలో జనసైనికులు మాత్రం మండిపడుతున్నారట. తమ పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే ఇలా లేని పోస్టును సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వాల్సిందేనని జనసేన నాయకులు కూడా పట్టుబడుతున్నారట.
మరి చంద్రబాబు వ్యూహానికి నాగబాబు ఓకే చెప్తారా? లేదంటే మంత్రి పదవే కావాలని పట్టుబడతారా? దీనిపై పవన్ ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాలి.