మాట మార్చను. మడమ తిప్పను అన్న నానుడిని ఫాలో అయిన కాపు ఉద్యమ నేత రెడ్డిగా మారారు. చేసిన శపథాన్ని నిలుపుకున్న ముద్రగడ తన పేరు చివరలో రెడ్డిని తగిలించుకున్నారు. దీంతో ఇప్పుడు ఆయన పేరు అధికారికంగా ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయింది. ఇదే పేరును గుర్తిస్తూ గెజిట్ కూడా విడుదల చేసింది ఏపీ సర్కార్.
కాపు సామాజిక వర్గానికి చెందిన ముద్రగడ పద్మనాభం కాపుల హక్కుల కోసం ఎంతగానో కృషి చేశారు. ఉద్యమ పోరాటాలు సాగించారు. అలాంటి కాపు నేత రాజకీయాల కారణంగా పేరు చివర రెడ్డిని తగిలిం చుకున్నారు. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గెలుపొందడమే ఇందుకు కారణం. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ కురుక్షేత్రాన్ని తలపిం చింది. అధికార పార్టీ వైసీపీ, విపక్ష కూటమి టీడీపీ, జనసేన, బీజేపీల మధ్య హోరాహోరీ పోరు సాగింది. అయితే ఎన్నికల పోరులో పిఠాపురం నుంచి బరిలో దిగిన పవన్‌కల్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తాను ఊహించింది రివర్స్ అయింది. అంచనాలకు మించి పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందారు. వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన వంగా గీతను చిత్తుగా ఓడించారు.
పిఠాపురంలో పవన్‌కల్యాణ్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ముద్రగడను టార్గెట్ చేస్తూ జనసైనికులు నెట్టింట విమర్శలు గుప్పించారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ చేశారు. ఆయన పేరును మారుస్తూ నామకరణ మహోత్సవాలు నిర్వహించారు. దీంతో మీడియా ముందుకు వచ్చిన ముద్రగడ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నానని వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ క్రమంలోనే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చాలంటూ దరఖాస్తు చేసుకున్నారు. చెప్పినట్టుగానే పేరును మార్చుకో వడంతో ముద్రగడ పద్మనాభం పేరును మారుస్తూ గెజిట్ విడుదల చేసింది రాష్ట్ర ప్రభుత్వం.