తెలంగాణలో అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. పేదలందరికీ కార్డులు ఇస్తామని, ప్రతిపక్షాలు ఆరోపించినట్లు ఎవ్వరూ భయపడొద్దని చెప్పారు. గ్రామ సభలు ముగిసినా అర్హత ఉంటే రేషన్‌కార్డులు ఇస్తామన్నారు.
కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో ఉత్తమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ప్రజాపాలన దరఖాస్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభలు ముగిసినా అర్హత ఉంటే రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. రేషన్ కార్డు ప్రక్రియ ముగిశాక సన్న బియ్యం ఇస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ మంచి క్వాలిటీ సన్న బియ్యం 6 కిలోలు ఇస్తామన్నారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామన్నారు. ప్రజాపాలన దరఖాస్తులు అన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు.
పదేళ్లపాటు రేషన్ కార్డులు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలను మోసం చేసిందని ఆయన మండిపడ్డారు. 40 లక్షల మందికి మేలు చేకూరే విధంగా తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని చెప్పారు. ఏడాదిలోగా నారాయణపూర్ ప్రాజెక్టు పూర్తిచేస్తామని వివరించారు. నారాయణపూర్ గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటిస్తామన్నారు. నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఉత్తమ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.