ముఖ్యమంత్రి చంద్రబాబును గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నిన్న సచివాలయంలో కలిశారు. ఏలూరు జిల్లా నూజివీడులో ఇటీవల జరిగిన సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌తో కలిసి పాల్గొనడంపై ఆయన వివరణ ఇచ్చినట్లు తెలిసింది. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా సాక్షాత్తు పార్టీ అధినేత చంద్రబాబు ఇంటిపైకి దండెత్తి వెళ్లిన జోగి రమేష్‌తో మంత్రి పార్థసారథి, ఇతర టీడీపీ నాయకులు వేదిక పంచుకోవడంపై ఆ పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. దీనిపై ఆయన సీఎం చంద్రబాబును కలిసి వివరణ ఇచ్చినట్లు తెలిసింది. మరోమారు ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సీఎం చెప్పినట్లు సమాచారం.