KLU.. ఈ పేరు చెబితే చాలు ఎంతో ప్రతిష్టాత్మకమైన విశ్వ విద్యాలయం అని అంతా చెప్పుకునే వారు. అక్కడ చదివితే ప్లేస్‌మెంట్ గ్యారెంటీ అని.. లక్షల్లో జీతాలు ఖాయమని అనే వాళ్లు. కానీ, చేసిన మోసం ఎన్నాళ్లో దాగదు కదా. అందుకే KL యూనివర్సిటీ భాగోతం బట్టబయలైంది. A ++ గుర్తింపు పొందేందుకు KLU అడ్డదారులు తొక్కిన విషయం నిజమేనని సీబీఐ తేల్చడం సంచలనంగా మారింది. మరిప్పుడు విద్యార్థుల భవిష్యత్ ఏంటి..?
ఎల్ యూనివర్సిటీ పరువు గంగలో కలిసిపోయింది. గుంటూరు జిల్లా వడ్డేశ్వరపురంలో ఉన్న విశ్వవిద్యాలయం పరిశీలనకు వచ్చే న్యాక్ తనిఖీ బృందంలో తమకు అనుకూలమైన ప్రొఫెసర్లే సభ్యులుగా ఉండేలా, సానుకూలమైన నివేదిక ఇచ్చేలా వర్సిటీ యాజమాన్యం ముందుగానే సంబంధిత వ్యక్తులతో కుమ్మక్కైనట్లు సీబీఐ తేల్చింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మొత్తం వ్యవహారం బయటకు రావడంతో ఏపీలోనే కాదు.. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. కేఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తల్లితండ్రులు ఉలిక్కిపడ్డారు. దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన కేసులో కేఎల్‌యూ యాజమాన్య ప్రతినిధులు, న్యాక్ బృందంలో సభ్యులైన ప్రొఫెసర్లు సహా 10 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ… వారందర్నీ విజయవాడలోని సీబీఐ కోర్టులో హాజరుపరిచింది. న్యాయ స్థానం నిందితులందరికీ 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
రిమాండ్ రిపోర్ట్‌లో ఉన్న కొన్ని కీలక విషయాలను గమనిస్తే.. కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్ – KLEF ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, వైస్ ఛాన్స్‌లర్ జీపీ సారథి వర్మలు.. న్యాక్ డైరెక్టర్ ఎం హనుమంతప్ప, మాజీ ఉప సలహాదారు ఎల్ మంజునాథరావు, సలహాదారు శ్యామ్‌సుందర్‌లతో కుమ్మక్కయ్యారు. వారి ద్వారా తమకుక అనుకూలమైన వారిని న్యాక్ తనిఖీ బృందంలో సభ్యులుగా చేర్పించుకున్నారు.
అంతేకాదు.. న్యాక్ అక్రిడేషన్ కోసం.. తమ విద్యాసంస్థకు అనుకూలమైన రేటింగ్ ఇచ్చేందుకు..న్యాక్ సభ్యులకు KL యూనివర్సిటీ నిర్వాహకులు లక్షలాది రూపాయల మేర డబ్బు ఇచ్చారని తేల్చారు. న్యాక్ సభ్యులకు నగదు, బంగారం, మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల రూపంలో ఇచ్చినట్లు గుర్తించింది సీబీఐ.
అసలు.. ఈ విషయం బయటకు రావడంతో.. చెన్నై, బెంగళూరు, విజయవాడ, పాలెం, సంబల్‌పూర్, భోపాల్, బిలాస్‌పూర్, గౌతమ్ బుద్ధ్ నగర్, న్యూఢిల్లీలోని 20 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్ సోదాలు నిర్వహించింది. 37 లక్షల నగదు, 6 ల్యాప్‌టాప్‌లు, ఐఫోన్ ను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఏ1 గా ప్రెసిడెంట్ కోనేరు సత్యనారాయణ, ఏ2గా వైస్ ఛాన్సలర్ జీపీ సారథి వర్మ, ఏ3గా వైస్ ప్రెసిడెంట్ కోనేరు రాజా హరీన్, ఏ4గా హైదరాబాద్ క్యాంపస్ డైరెక్టర్ ఎ. రామకృష్ణ, ఏ5గా న్యాక్ మాజీ డిప్యూటీ అడ్వైజర్ డాక్టర్ ఎల్. మంజునాథ రావు పేర్లను చేర్చింది. ఏ6గా బెంగళూరు విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎమ్. హనుమంతప్ప, ఏ7గా న్యాక్ సలహాదారు ఎమ్.ఎస్ శ్యాంసుందర్ పేర్లను చేర్చారు. వీరితో పాటు ఏ8గా న్యాక్ ఇన్‌స్పెక్షన్ కమిటీ ఛైర్మన్, రామచంద్ర చంద్రవంశీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ సమరేంద్ర నాథ్ సాహా, ఏ9గా జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ రాజీవ్ సిజారియా, ఏ10- ఏ14 వరకు న్యాక్ కమిటీ సభ్యుల పేర్లను చేర్చారు.
నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడేషన్ కౌన్సిల్- న్యాక్…. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న కాలేజీల్లో వసతి సదుపాయాలు, టీచింగ్ సిబ్బంది, ల్యాబ్ ల వంటి అంశాలపై ప్రమాణాలను నిర్ధారిస్తుంది. ఆయా సంస్థల్లో ఉన్న పరిస్థితులను బట్టి వాటికి రేటింగ్ ఇస్తుంది. A++, A+, A, B++ వంటి ర్యాంకులు ఇస్తుంది. ఇందులో A++ రేటింగ్… టాప్ ప్లేస్ ఉన్న వాటికి ఇస్తుంది న్యాక్. A++ర్యాంక్ కింద ఒక యూనివర్సిటీని పరిగణించాలంటే జాతీయస్థాయి సంస్థల్లో ఉండాల్సిన ఏర్పాట్లు, సౌకర్యాలు, బోధన, బోధనేతర సిబ్బంది, క్లాస్ రూంలు, ల్యాబ్‌లు, తరగతి గదులు ఇలా… అన్నింట్లోనూ టాప్‌గా ఉండాలి. అలాంటి వాటికి న్యాక్ A++ ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ రేటింగ్ ఇవ్వడం వల్ల… విద్యాసంస్థకు మంచి పేరు వస్తుంది.
విద్యార్థులు సహజంగానే మంచి పేరున్న కళాశాలలో చదువుకోవడానికి మొగ్గు చూపుతారు. దీంతో.. కేఎల్ యూనివర్శిటీ యాజమాన్యం…తమ అడ్మిషన్లను పెంచుకోవడానికి అడ్డదారులు తొక్కినట్లు ఆరోపణలు వస్తున్నాయి. కోనేరు లక్ష్మయ్య ఇంజినీరింగ్ ఫౌండేషన్‌ను 1980లో గుంటూరు జిల్లా వడ్డేశ్వరంలో స్థాపించారు. 2006లో స్వయం ప్రతిపత్తి పొందింది. 2009లో డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందింది. యూనివర్సిటీ పేరును ఉపయోగించకూడదని… యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో కోనేరు లక్ష్మయ్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్‌గా పేరు మార్చారు. 2019లో KL డీమ్డ్ యూనివర్సిటీగా మార్చింది యాజమాన్యం.
న్యాక్ నుంచి A++ ర్యాంకులో కొనసాగుతూ దేశంలోనే అత్యున్నత యూనివర్సిటీల్లో 22వ ర్యాంకులో కేఎల్ యూనివర్సిటీ ఉంది. అయితే, సీబీఐ అధికారుల తనిఖీల్లో కేఎల్ యూనివర్శిటీ బండారం బయటపడింది. ఇప్పటి వరకు విద్యా ప్రమాణాల విషయంలోనూ, టీచింగ్ స్టాప్ తోపాటు కాలేజీలోని మౌలిక వసతులు.. తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి న్యాక్ బృందం ర్యాంకింగ్ ఇస్తుందని అందరూ భావిస్తూ వచ్చారు. కానీ, ప్రస్తుతం కేఎల్ విశ్వవిద్యాలయం బండారం బయటపడటంతో దేశ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో న్యాక్ ఇచ్చిన ర్యాంకింగ్స్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేఎల్ యూనివర్శిటీలో 50 కోర్సులకుపైగా ఉన్నాయి. సుమారు 20వేల మంది విద్యార్థులు ఇందులో విద్యనభ్యసిస్తున్నారు. ర్యాంకును బూచిగా చూపిస్తూ డీమ్డ్ యూనివర్శిటీగా కేఎల్ యూనివర్శిటీ కొనసాగుతుంది. యూనివర్సిలో విద్యార్థులను చేర్పించిన తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చెందుతున్నారు.
న్యాక్ ఇచ్చిన A++ ర్యాంక్ ను చూపించి తమది డీమ్డ్ యూనివర్శిటీ అంటూ విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఇన్నాళ్లు కేఎల్ యూనివర్సిటీ మభ్యపెట్టినట్లు ప్రస్తుతం స్పష్టమైంది. ఈ యూనివర్శిటీలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులే కాకుండా చెన్నై, కర్ణాటక, ఒడిషాకు చెందిన విద్యార్థులు కూడా విద్యనభ్యసిస్తున్నారు. తాజా పరిణామాలతో యూనివర్సిటీలో సరైన సదుపాయాలు కూడా లేవన్న వాదన వినిపిస్తోంది. మరిప్పుడు సీబీఐ కేసు నమోదు, వాస్తవాలు వెలుగులోకి రావడంతో కేంద్ర విద్యాశాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఉత్కంఠగా మారింది.