దేశవ్యాప్తంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహిస్తున్నారు. “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0” పేరుతో చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు సరఫరా చేస్తున్న ముఠాలను లక్ష్యంగా చేసుకుని పోలీసులు దేశవ్యాప్తంగా విస్తృత చర్యలు చేపట్టారు.
ఈ ఆపరేషన్‌లో భాగంగా రాజస్థాన్, గుజరాత్, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, బీహార్, జార్ఖండ్ సహా మొత్తం 15 రాష్ట్రాల్లో హైదరాబాద్ సైబర్ క్రైమ్ బృందాలు ఒకేసారి దాడులు నిర్వహించాయి. సైబర్ మోసాలకు ఉపయోగించే నకిలీ లేదా అక్రమ సిమ్ కార్డుల సరఫరా నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించినట్లు వెల్లడించారు.
దర్యాప్తులో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు అందజేస్తున్న 10 మంది ఏజెంట్లను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే సైబర్ నేరాలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న మరో 30 మందికి నోటీసులు జారీ చేశారు. వీరు నకిలీ పత్రాలు, ఫేక్ ఐడీలు ఉపయోగించి భారీ సంఖ్యలో సిమ్ కార్డులు సేకరించి సైబర్ ముఠాలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గతంలో కూడా “ఆపరేషన్ ఆక్టోపస్” పేరిట రెండు విడతల్లో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించారు. మొదటి దశ “ఆపరేషన్ ఆక్టోపస్ 1.0”లో సైబర్ నేరగాళ్లకు బ్యాంక్ ఖాతాలను అందజేస్తున్న అకౌంట్ హోల్డర్లపై దృష్టి సారించారు. అనంతరం “ఆపరేషన్ ఆక్టోపస్ 2.0”లో సైబర్ నేరాలకు సహకరిస్తున్న బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుని విచారణ చేపట్టారు.
ఇప్పుడు “ఆపరేషన్ ఆక్టోపస్ 3.0”లో భాగంగా సిమ్ కార్డుల అక్రమ సరఫరా వ్యవస్థపై ఫోకస్ పెట్టారు. సైబర్ నేరాలకు ఉపయోగించే కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ను దెబ్బతీయడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
దేశవ్యాప్తంగా ఇంకా ఈ ఆపరేషన్ కొనసాగుతుండగా, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని పోలీసులు వెల్లడించారు. సైబర్ నేరాల మూలాలను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.


