వరదలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం అప్రమత్తంగా ఉన్నందువల్లే.. పెద్దనష్టం తప్పిందని చెప్పారాయన. ఖమ్మంలో ఆక్రమణల వల్లే వరదలు వచ్చాయన్నారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ద్వారా గుర్తించి అవసరమనుకుంటే ఆక్రమణలను తొలగిస్తామన్నారు ముఖ్యమంత్రి. మున్నేరు రిటైనింగ్ వాల్ ఎత్తు పెంచడంపై ఇంజినీర్లతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. కృష్ణా, ఖమ్మం జిల్లాలు పక్కపక్కనే కవలపిల్లల్లాగే ఉంటాయని అన్నారు. కృష్ణా కంటే ఖమ్మంలో రికార్డు స్థాయిలో..42 సెంటీమీటర్ల వర్షం పడిందని చెప్పారు. 75 ఏళ్లలో ఇంతటి వర్షం చూడలేదని రేవంత్ అన్నారు.
బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం దగ్గర లక్ష కోట్లు ఉన్నాయని అన్నారు. సీఎం సహాయనిధికి 2వేల కోట్లు కేసీఆర్ ఇవ్వాలని చెప్పారు. అమెరికాలో ఉండి కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖమ్మంలో పువ్వాడ అజయ్ ఆక్రమణలు తేలుస్తామని హెచ్చరించారు. హరీష్ రావు వస్తే.. నిజనిర్ధారణ కమిటీ వేద్దామని చెప్పారు. పువ్వాడ ఆక్రమణల్లో నిర్మించిన ఆస్పత్రిని తొలగించి ఆదర్శంగా నిలవాలని సూచించారు.
వరదల సహాయక చర్యల్లో మంత్రులు ప్రజలతోనే ఉంటున్నారని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఓటు వేసి గెలిపించారు కాబట్టి తమనే నిలదీస్తారని.. ఫామ్ హౌస్ లో పడుకున్న వారిని అడుగుతారా.. అని ప్రశ్నించారు. తెలంగాణకు కూడా ప్రత్యేకంగా విపత్తు నిర్వహణ సంస్థను సిద్ధం చేస్తున్నామని రేవంత్ చెప్పారు. వరద ముంపు బాధితులకు వెంటనే 10వేల సాయం అందిచామని రేవంత్ స్పష్టం చేశారు.