ఆంధ్రప్రదేశ్‌లో ఏనుగుల బీభత్సవాన్ని అరికట్టేందుకు దసరా తరువాత 8 కుంకి ఏనుగులు పంపేందుకు కర్ణాటక అంగీకరించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. విజయవాడలో కర్ణాటక మంత్రి ఈశ్వర్‌తో పవన్ సమావేశం అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించుకొని ఎం.ఓ.యూ. కుదుర్చుకున్నారు. ఇటీవల కర్ణాటక వెళ్లి కుంకీ ఏనుగుల అంశంపై ఆ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించామని పవన్ తెలిపారు. ఏపీలో ఏనుగుల సంరక్షణ, వాటి ఆహారం తదితర అంశాలపై ఒప్పందం చేసుకున్నామన్నారు. దేశంలో ఎక్కడా జరుగని విధంగా అటవీశాఖపై ఇరు రాష్ట్రాలు ఒప్పందాలు చేసుకున్న దాఖలాలు లేవని అన్నారు. ఆరు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. ఏపీ, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఎలిఫెంట్ కారిడార్ ఏర్పాటుకు నిర్ణయించామని డిప్యూటీ సీఎం పవన్ చెప్పారు.