ఏపీలో లడ్డూ లడాయితో పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. టీడీపీ, వైసీపీ మధ్య జరిగిన డైలాగ్ వార్ చిలికి చిలికి తీవ్ర రాజకీయ దుమారంగా మారింది. ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. అయితే,.. టీడీపీ వర్సెస్ వైసీపీగా ఉన్న ఈ వివాదం జగన్, మోదీకి మధ్య జగడానికి దారి తీస్తోంది.
గత నాలుగైదు రోజులుగా సాగుతున్న ఈ లడ్డూ వివాదంపై స్పందించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్. రాజకీయ కుట్రతోనే చంద్రబాబు తమపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు తన పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే నెయ్యి నాణ్యతపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందనేది ఒక కట్టు కథ అని కొట్టిపారేశారు. దేవుడిని కూడా రాజకీయాలకు వాడుకునే దుర్మార్గమైన మనస్తత్వం చంద్రబాబుది అని విమర్శించారు. భక్తుల మనోభావాలతో ఆడుకోవడం ధర్మమేనా? అని ప్రశ్నించారు.
చంద్రబాబుపై విరుచుకుపడుతూనే కమలనాథులపై కూడా మండిపడ్డారు జగన్. వాళ్లకు సగం తెలుస్తుంది… సగం తెలియదని ఎద్దేవా చేశారు. TTD బోర్డులో బిజెపికి చెందిన సభ్యులు కూడా ఉన్నారు.. బోర్డులో ఏం జరుగుతుందో తెలియదా అని ప్రశ్నించారు. తెలియకపోతే తెలుసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీకి నిజంగా హిందూత్వంపై చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబుకి అక్షింతలు వేసే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఓవైపు కమలనాథులపై మండిపడుతూనే.. ఈ వివాదంపై ప్రధాని మోదీకి లేఖ రాస్తానని తెలిపారు జగన్. రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు తిరుమల ఆలయాన్ని భ్రష్టుపట్టిస్తున్నారని, దీనిపై ప్రధానితోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాస్తానన్నారు.
జగన్ బీజేపీపై చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఇన్నాళ్లు కమలనాథులకు మిత్రపక్షంగా ఉన్న వైసీపీ అధినేత.. ఒక్కసారిగా వారిపై కూడా విమర్శలు చేయడం దేనికి సంకేతమన్న టాక్ నడుస్తోంది. చంద్రబాబు కూటమిలో కీలకంగా మారారు కాబట్టి… పూర్తిగా తెగదెంపుల నేపథ్యంలోనే ఈ వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ సాగుతోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో చంద్రబాబు, పవన్‌నే ప్రధాన రాజకీయ శత్రువులుగా భావిస్తున్న వైసీపీ.. బీజేపీతో వీరిద్దరి కలయిక కారణంగా కమలం పార్టీకి దూరంగా ఉండాలనుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ వివాదంపై బీజేపీ పెద్దలు కూడా సీరియస్ అయ్యారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడిన జేపీ నడ్డా.. ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.