హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల ఇళ్లలో ఐటీ సోదాలు ముగిశాయి. తెల్లవారుజాము వరకు ఆదాయపు పన్ను శాఖ అధికారుల తనిఖీలు కొనసాగాయి. ఈ సోదాల్లో కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు.
గత నాలుగు రోజులుగా టాలీవుడ్‌కి చెందిన ప్రముఖుల ఇళ్లలో ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. సంక్రాంతి సందర్బంగా వరుసగా సినిమాలు రిలీజ్ అయ్యాయి. భారీ బడ్జెట్ సినిమాలు తీసిన ప్రొడ్యూసర్లు.. భారీ కలెక్షన్లు వచ్చాయని ప్రకటించుకున్నారు. అయితే సినిమాలపై ఎంత బడ్జెట్ పెట్టారు.. ఎంత ఆదాయం వచ్చింది.. ఎంత పన్ను కట్టారు అనే విషయంపై అధికారులు ఆరా తీశారు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్,బంజారాహిల్స్, మాదాపూర్, కొండాపూర్ లో ఈ సోదాలు జరిగాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజుకు చెందిన SVC బ్యానర్‌తో పాటు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో సంస్థల్లో అధికారులు సోదాలు చేశారు. పుష్ప-2 బడ్జెట్, వచ్చిన ఆదాయంపై అధికారుల ఆరా తీశారు. ఐటీ రిటర్న్స్ భారీగా ఉండడంతో ఈ సోదాలు చేసినట్టు తెలుస్తోంది. దిల్ రాజు భార్య తేజస్వినితో బ్యాంకు లాకర్లు తెరిపించారు. డాక్యుమెంట్లను పరిశీలించారు. SVC ఆఫీస్‌కు దిల్ రాజును తీసుకెళ్లారు.
దిల్ రాజు నివాసం, కూతురు హన్సిత నివాసం, సోదరుడు శిరీష్ నివాసాల్లో కూడా తనిఖీలు చేశారు. మైత్రి మూవీ మేకర్స్ కార్యాలయం .. నవీన్ ఎర్నేని, రవి శంకర్ నివాసాలు.. మ్యాంగో సంస్థల యజమాని యరపతినేని రామ్ ఇళ్ళు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. సంక్రాంతి నేపథ్యంలో వచ్చిన భారీ సినిమాల పెట్టు బడులు, ఆదాయం పైన ఆరా తీశారు. ఆయా సంస్థల బాలెన్స్ షీట్స్ ను పరిశీలించారు ఐటీ అధికారులు.
గేమ్ ఛేంజర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలకు దిల్‌రాజు ప్రొడ్యూసర్‌గా ఉండగా… డాకు మహారాజ్ సినిమాకు డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. మూడు సినిమాలు పెద్ద బడ్జెట్‌తో తీసినవే కావడంతో ఐటీ ఫోకస్ పెట్టింది.