బుల్లితెరపై ప్రసారం అవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్‌లో జగతి మేడంగా అలరిస్తున్న జ్యోతిరాయ్ ప్రస్తుతం తన మేకోవర్‌ను పూర్తిగా ఛేంజ్ చేసుకున్నారు. సీరియల్‌లో తల్లిపాత్ర చేసిన ఈమె ప్రస్తుతం బరువు తగ్గి తన అందాన్ని పెంచుకుని హీరోయిన్‌లా మారిపోయారు. ఆమె ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫొటోలు చూసి కుర్రాళ్ల మతులు పోతున్నాయి. అంతలా ఆమె తన గ్లామర్‌ను పెంచుకున్నారు. గ్లామర్ లుక్ పెరగడంతో ఆమెకు సినిమా అవకాశాలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘ఎ మాస్టర్ పీస్’ చిత్రంలో ఆమె నటిస్తోంది. అలాగే మరికొన్ని సినిమా ప్రాజెక్టులు కూడా లైన్లో ఉన్నాయి. వరుసగా సినిమా ఆఫర్స్ వస్తుండడంతో ఆమె సీరియల్స్‌కు బ్రేక్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
దీంతో ఆమె నటిస్తున్న గుప్పెడంత మనసు సీరియల్ నుంచి త్వరలోనే ఆమె నిష్క్రమించనున్నారు. అయితే ఆమెను రీప్లేస్ చేసే నటి దొరకకపోవడంతో ఆమె క్యారెక్టర్‌ను చంపేయాలని మేకర్స్ నిర్ణయించారు. జ్యూస్‌లో విషం కలిపి ఇవ్వగా.. అది తాగిన జగతి మరణిస్తుంది. దీంతో ఆమె క్యారెక్టర్‌కు గుప్పెండత మనసు సీరియల్‌లో ఫుల్‌స్టాప్ పడుతుంది. త్వరలోనే ఆమె క్యారెక్టర్ ముగుస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కుమారుడి ప్రేమకు దూరమై, నరకయాతన అనుభవించే తల్లి పాత్రలో జ్యోతిరాయ్ పండించిన అభినయం బుల్లితెర ప్రేక్షకులను కట్టిపడేసింది. జగతి పాత్రకు ఆమె వందకు వంద శాతం న్యాయం చేసింది. అలాంటి క్యారెక్టర్ మధ్యలో నిష్క్రమించడం సీరియల్‌పై ఎలాంటి ఎఫెక్ట్ కలుగజేస్తుందో చూడాలి.