ద్వారకా తిరుమల వెంకన్న స్వామి కళ్యాణం
ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల శ్రీవెంకటేశ్వరుని వైశాఖ మాస తిరుకళ్యాణోత్సవం కన్నులపం డువగా సాగింది. తొలుత తొళక్కవాహనంపై స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన అనివేటి మండపంకు తోడ్కొని వచ్చి వైఖాసన ఆగమాన్ని అనుసరించి కళ్యాణ తంతును చేపట్టారు. ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు దేవస్ధానం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించగా, భక్తుల గోవింద నామస్మరణలు మిన్నంటాయి.
మల్లూరు హేమాచలేశ్వరుడి కళ్యాణోత్సవం
తెలంగాణాలో మరో యాదగిరిగుట్టగా ప్రసిద్ధిగాంచిన ములుగు జిల్లా మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసిం హ స్వామి కళ్యాణ మహోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఈనెల 23వరకు జరిగే ఈ ఉత్సవాలకు భారీగా భక్తులు తరలివచ్చారు. చింతామని జలపాతం వద్ద పుణ్యస్నానం చేసినాంతరం భద్రాచలం శ్రీ రామచంద్ర స్వామి ఆలయ అర్చక బృందం ఈ ఉత్సవాలను నిర్వహించింది.
పోలీసు కవాతు
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పోలీసులు కేంద్ర సాయుధ బలగాలతో కలసి కవాతు నిర్వహించారు. నాలుగు రోడ్ల జంక్షన్ నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఈ కవాతు జరిగింది. జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల కౌంటిగ్‌ను దృష్టిలో ఉంచుకుని ఎటువంటి అల్లర్లు, గొడవలు జరగకుండా ప్రజల్లో భరోసా కల్పించేందుకు ఈ కవాతు చేపట్టినట్లు చెప్పారు,
మున్సిపల్ కమిషనర్ సస్పెండ్
బాన్సువాడ మున్సిపల్ కమిషనర్ అలీమ్ సస్సెండ్ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో బైంసా మున్సిపాల్టీలో పనిచేసిన కమీషనర్ అలీమ్ ప్రభుత్వ నిబంధనల్ని తుంగలో తొక్కి పలు అవినీతి అక్రమాలకు పాల్పడటంతో ప్రభుత్వం ఈ మేరకు చర్యలు తీసుకుంది.
గంజాయి కలకలం
కామారెడ్డి జిల్లాలో గంజాయి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. సిగరెట్లలో గంజాయి పౌడర్‌ను నింపి యువకులను, విద్యార్థులను మత్తులో ముంచుతున్నారు. పట్టణాలనే కాకుండా పల్లెలకు కూడా ఈ మత్తు పాకింది. ముఖ్యంగా బాన్సువాడ పట్టణం దీనికి అడ్డాగా మారింది. యువతే టార్గెట్‌గా సాగుతున్న ఈ విక్రయాలపై అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంపై స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేసారు.
కొడవలితో దాడి
నంద్యాల జిల్లా, ఆత్మకూరులో దారుణం చోటు చేసుకుంది. సెల్‌పోన్ ఇవ్వలేదన్న కారణంతో ఇరువురు వ్యక్తులు ఘర్షణకు దిగారు. రాములు అనే వ్యక్తి శ్రీనుపై కొడవలితో దాడి చేయగా ప్రతి దాడి చేయడంతో రాములు తలకు తీవ్ర గాయమైంది. పరిస్ధితి విషమించడంతో చికిత్సకై కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
సెల్ ఫోన్స్ స్వాధీనం
నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. చిగురుమానుపేట లో ఇద్దరు అనుమానితుల్ని ప్రశ్నించగా చోరీ చేసిన 130 సెల్ ఫోన్లు దొరికాయి. దీంతోపాటు లక్షా 45 వేల నగదు లభించింది. పట్టుబడ్డ సెల్ ఫోన్ ల విలువ 21 లక్షల ఉంటుందన్న పోలీసులు వీరిద్దరిపై కేసు నమోదు చేసారు.
వానలో తడుస్తూనే … రుషి సునాక్ ప్రకటన
బ్రిటన్ సార్వత్రిక ఎన్నికలు జులై నాల్గో తేదీన జరగనున్నాయి. ఈ మేరకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ స్పష్టత నిచ్చారు. దీనికి అనుగుణంగానే త్వరలో పార్లమెంటును రద్దు చేయనున్నట్లు తెలిపారు. తన అధికారిక నివాసమైన 10 డౌనింగ్ స్ట్రీట్‌లో జోరు వానలో నిలబడి తడుస్తూనే ఈ ప్రకటన చేసారు. బ్రిటన్ ప్రజలు తమ భవిష్యత్తు ఎలా ఉండాలో ఎంచుకునే సమయం వచ్చిందన్నారు సునాక్.
దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు
వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు వీడ్కోలు పలికాడు. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ అనంతరం కార్తీక్ ఈ నిర్ణయాన్ని ప్రకటించాడు. ఐపీఎల్ 17 సీజన్‌లో ఆర్సీబీకి ప్రాతినిధ్యం వహించిన కార్తీక్ 15 మ్యాచ్‌ల్లో 36.22 సగటుతో 326 పరుగులు చేసాడు. గతంలో కోల్‌కతా, ముంబయి ఇండియన్స్, గుజరాత్ లయన్స్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు కార్తీక్.
పారా అథ్లెటిక్స్ లో గోల్డ్ మెడల్ విజేత
పారా అథ్లెటిక్స్ లో వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన జీవంజి దీప్తి వరల్డ్ రికార్డు సృష్టించింది. జపాన్ లో జరిగిన కోబ్-24 వరల్డ్ పారా అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. ఉమెన్స్ టీ-20 కేటగిరీ 400 మీటర్ల పరుగులో కేవలం 55.07 సెకండ్స్ లో పూర్తి చేసింది. 2024 పారిస్ లో జరిగే పారా ఒలింపిక్స్ కు అర్హత పొందింది. 20 ఏళ్ల వయస్సులోనే ఆమె ఈ రికార్డును క్రియేట్ చేయడంపై పలువురు హర్షం వ్యక్తం చేసారు.
వాయుగుండం బలపడితే రెమాల్ గా నామకరణం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. వాయుగుండం తుఫానుగా బలపడితే రెమాల్ గా నామ కరణంచేయనుంది వాతావరణ శాఖ. సముద్రం అల్లకల్లోలంగా మారనున్న నేపథ్యంలో మత్స్యకారులు ఆదివారం వరకు చేపల వేటకు వెళ్లరాదని హెచ్చరించింది.
వేదాద్రి యోగానందుడికి తెప్పోత్సవం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలోని వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మి నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. స్వామివారి కళ్యాణం బుధవారం రాత్రి 12 గంటలకు జరగగా ఇవాళ ఉదయం తెప్పోత్సవం, గజవాహన సేవ నిర్వహించారు. చక్ర తీర్థం వసంతోత్సవం, ధ్వజావరోహణ నిర్వహించను న్నారు. ఈ నెల 25 న ప్రవలింపు సేవ, సాంస్కృతిక కార్యక్రమములను నిర్వహస్తామని నిర్వహకులు తెలిపారు.