తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(టిఎఫ్‌జేఏ).. సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తోన్న సంఘం. సభ్యుల ఆరోగ్యం, కుటుంబ సభ్యుల బాగోగులను చూస్తూ ప్రతి సభ్యుడికీ ఇంటి పెద్దలా అండగా నిలుస్తోంది. ప్రతి సభ్యుడి కుటుంబానికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యంతో పాటు టర్మ్ పాలసీ, యాక్సిడెంటల్ పాలసీలను ఉచితంగా అందిస్తోంది. ఇందుకోసం సినీ పరిశ్రమ సహాయ సహకారాలతో పాటు సభ్యులందరి తోడ్పాటును తీసుకుంటోంది. ఈ యేడాది (2023 మార్చి- 2024 మార్చి) సభ్యుత్వం తీసుకున్న వారికి గుర్తింపు కార్డులతో పాటు, హెల్త్ కార్డ్స్‌ను అందించే కార్యక్రమాన్ని సోమవారం సాయంత్రం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ముఖ్య అతిథిగా హాజరు కాగా.. గౌరవ అతిథులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన నవీన్ యెర్నేని, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాత టిజి విశ్వ ప్రసాద్, షైన్ స్క్రీన్స్ ప్రొడ్యూసర్ సాహు గారపాటితో పాటు శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్.పి, ఏసియన్ సినిమాస్ సీఎంఓ జాన్వీ నారంగ్ హాజరయ్యారు.
ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో టీఎఫ్‌జేఏ ప్రధాన కార్యదర్శి వైజే రాంబాబు మాట్లాడుతూ.. ‘‘పిలవగానే విచ్చేసిన మా ముఖ్య అతిథి ప్యాన్ ఇండియా హీరోయిన రష్మిక గారికి కృతజ్ఞతలు. విశ్వ ప్రసాద్ గారికి, నవీన్ గారికి, సాహు గారికి, జాన్వీ గారికి థ్యాంక్యూ. వీరు అడిగిన వెంటనే స్పందించడానికి, పిలవగానే రావడానికి కారణం.. మన అసోసియేషన్‌కు ఉన్న గుడ్ విల్. వీళ్లు మాకు ఎంతో చేస్తున్నారు. మరి మనం వారికి ఏం చేస్తున్నాం అనిపించినప్పుడు రీసెంట్‌గా దిల్ రాజు గారు, చిరంజీవి గారితో అసోసియేషన్ తరఫున సినిమా కోసం ఏం చేయాలి అని మాట్లాడాం. మన జర్నలిస్ట్‌లకు వాళ్లు అంత సాయం చేస్తున్నప్పుడు.. వారికి సమస్యలు వచ్చినప్పుడు జర్నలిస్ట్‌లుగా మనం చేయాలని చర్చించాము. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత ఎక్కువ నాన్సెస్ జరుగుతోంది. వీటిలో ఎక్కువగా ఇబ్బంది పడేది సెలబ్రిటీసే. హీరోలు, హీరోయిన్లపై ఏది పడితే అది రాస్తున్నారు. అలాంటప్పుడు వాళ్లు ఒంటరిగా ఫైట్ చేయలేరు. సినిమాలు, షూటింగ్స్ ఉంటాయి. అలాంటప్పుడు మా అసోసియేషన్ తరఫున మేం అండగా ఉంటామని హామీ ఇచ్చాము. పోలీస్ డిపార్ట్ మెంట్, లాయర్స్, ఛాంబర్, మా అసోసియేషన్ వారితో మాట్లాడి ఓ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీలో మా సభ్యులు కూడా నలుగురు ఉంటారు. దీని వల్ల ఇకపై ఇండస్ట్రీలో సెలబ్రిటీస్‌కు వచ్చే సమస్యలు తీరేవరకూ మేం ఫైట్ చేస్తాం. ఇది చెప్పగానే చిరంజీవి, దిల్ రాజు అద్భుతమైన ఐడియా అని మెచ్చుకున్నారు. వెంటనే ప్రారంభించమని ప్రోత్సహించారు. అయితే కొన్ని లీగల్ ఇష్యూస్ కూడా చూసుకుని ఈ కమిట్ స్టార్ట్ చేయబోతున్నాం. ఏదో ఒక సమస్య వస్తే మొత్తం మీడియాను బ్లేమ్ చేస్తున్నారు. తప్పులు అందరూ చేయరు. చేసిన ఒకరిద్దరి వల్ల మొత్తం సమస్య రాకూడదు. ఇంతకు ముందు మా అసోసియేషన్‌తో పాటు ఇతర అసోసియేషన్స్‌లో ఫిర్యాదులు చేసేవారు. ఇకపై ఎవరైనా ఏదైనా సమస్య గురించి మన కమిటీకి చెబితే ఆ సమస్య తీరేవరకూ జర్నలిస్ట్‌లుగా మనం తీసుకోబోతున్నాం. ఇది భవిష్యత్‌లో జరగబోయే కార్యక్రమం.’’ అని తెలియజేశారు.