స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణకు ఎంపీ అవినాశ్ రెడ్డి డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. తల్లి అనారోగ్యంతో ఉందని ఆయన విచారణకు హాజరుకాకుండా పులివెందుల వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన కాన్వాయ్ అనుసరిస్తున్న మీడియా ఛానల్స్ కు చెందిన కార్లపై అవినాశ్ అనుచరులు దాడి చేశారు. అంతేకాకుండా ఓ ఛానల్ రిపోర్టర్ పై దాడి చేసి కెమెరా లాక్కెళ్లుతూ కారు అద్దాలు ధ్వంసం చేశారు.
ఈ వ్యవహారాన్ని మీడియా ప్రతినిధులు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై దృష్టికి తీసుకెళ్లగా.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనని మండిపడ్డారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్చలు తీసుకోవాలని ఆదేశించారు. గవర్నర్ తో పాటు ఏపీ, తెలంగాణ జర్నలిస్టుల సంఘాలు కూడా దాడిని తీవ్రంగా ఖండించాయి. మరోవైపు తమపై దాడి చేశారంటూ అవినాశ్ అనుచరులపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషనులో మీడియా ప్రతినిధులు ఫిర్యాదుచేశారు.