రేపే దేశంలో సార్వత్రి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దేశంలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తయితే, 2024 సార్వత్రిక సమరం మరో ఎత్తుగా జరిగాయి. దేశంలో ప్రధానమైన నియోజకవర్గాల్లో నువ్వా నేనా అన్నట్లు ఎన్నికల ఫైట్ తలపించింది. పోలింగ్ ముగిసి కౌంటింగ్‌కు కొన్ని గంటల సమయమే మిగిలిఉంది. ప్రస్తుతం పార్టీల అభ్యర్థుల దగ్గర నుంచి ఓటు వేసిన ప్రతి ఓటరు రిజల్ట్స్ కోసం టెన్షన్‌గా ఎదురుచూస్తున్నాడు. కేంద్రంలో అధికారంలోకి వచ్చేది ఎవరు. ఏపీలో మళ్లీ వైసీపీ అధికారం నిలుపుకుంటుందా. కూటమి తమ పంతం నెగ్గించుకుంటుందా. తెలంగాణలో కాంగ్రెస్ హవా కొనసాగిస్తుందా. ఇప్పుడు ఇవే ప్రశ్నలు ప్రతి ఓటరును కలవరపెడుతున్నాయి. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో పార్టీల్లో టెన్షన్ మొదలైంది. ఈ సారి కూడా వైసీపీ అధికారం నిలుపుకుంటుందని కొన్ని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో కూటమి నేతల్లో గుబులు మొదలైంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ కూటమికి పట్టం కట్టడంతో ఫ్యాన్ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారు. ఇలా ఓటరు నాడి అంతుచిక్కక పోవ డంతో ఏపీ వ్యాప్తంగా టెన్షన్ వాతావరణం నెలకొంది.