‘‘మా జీవితంలో ఇంతటి గొప్ప ఫుట్ బాల్ క్రీడాకారుడిని చూడలేదు…’’
‘‘మూడు వరల్డ్ కప్ లను బ్రెజిల్ దేశానికి అందించిన అద్భుత క్రీడాకారుడు’’
’’ఫుట్ బాల్ చరిత్రలో అతనిది ఒక శకం’’

ఇవన్నీ ఎవరిని ఉద్దేశించి రాసినవో మీకు అర్థమయ్యే ఉంటుంది. ఫుట్ బాల్ లో దిగ్గజ క్రీడాకారుడు ‘పీలే’ మరణ వార్త విని అభిమానులు సోషల్ మీడియాలో పెడుతున్న పోస్టింగులు ఇవి… వివరాల్లోకి వెళితే….
ఫుట్ బాల్ లో మూడు ప్రపంచకప్ పోటీల్లో విజయం సాధించి… బ్రెజిల్ దేశానికి ట్రోఫీలు అందించిన దిగ్గజ క్రీడాకారుడు, 82 సంవత్సరాల ‘పీలే’ అనారోగ్యంతో మరణించాడు. నాలుగు ప్రపంచకప్ పోటీల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడు కూడా పీలే అని చెప్పాలి. అలా మూడుసార్లు జట్టు విజయంలో కీలకమైన పాత్ర పోషించిన పీలే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కుటుంబ సభ్యుల సమక్షంలోనే కన్ను మూశాడు. అశేష అభిమాన జనం పీలే మరణ వార్త విని ఘోల్లుమన్నారు.
అతని ఆట తీరుతో ప్రపంచంలోని ఫుట్ బాల్ అభిమానులు మైమరచిపోయేవారు. గ్రౌండులో అతను పాదరసంలా ప్రత్యర్థుల మధ్య నుంచి జారిపోతూ, కన్ను మూసి తెరిచేలోపు, కాళ్లతో బాలుని పాస్ చేస్తూ… గోల్ పోస్ట్ వైపు కదులుతుంటే చూసేందుకు రెండు కళ్లూ చాలవని అభిమానులు తన్మయత్వం చెబుతూ ఉంటారు. కొన్ని కోట్లమంది ప్రపంచ ఫుట్ బాల్ అభిమానుల్ని సంపాదించుకున్న ‘పీలే’ మృతితో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
1958, 1962, 1970 ప్రపంచకప్ ఫుట్ బాల్ ట్రోఫీలను అందుకున్న జట్టులో పీలే కీలక ఆటగాడు అని చెప్పాలి.

ఫిఫా అధికారిక యూట్యూబ్ ఛానెల్ లో ‘పీలే టాప్ 5’ గోల్స్ అని కొడితే అతని మాయ ఏమిటో తెలుస్తుందని అభిమానులు చెబుతుంటారు. పీలే గ్రౌండులో పరుగు పెడుతుంటే ఒక శక్తి తరంగంలా ఉంటుందని అంటుంటారు. ఆ కాళ్లలో ఏదో మ్యాజిక్ ఉందంటారు.ప్రత్యర్థులతో వీడియో గేమ్ ఆడుకుంటున్నట్టుగా కాలుని అటూఇటూ కదుపుతూ ఛక్ మని పాస్ చేసి, మరుక్షణం మెరుపు వేగంతో అక్కడికి వెళ్లి గోల్ కొడితే, గోల్ కీపర్ కళ్లు తిరగాల్సిందేనని అంటారు.
అంత గొప్ప ఆటగాడు ‘పీలే’ గత ఏడాది క్యాన్సర్ కు గురయ్యాడు. సావోపాలో’ లోని అల్బర్ట్ ఐన్ స్టీన్ ఆసుపత్రిలో చేర్పించారు. ఆరు నెలల చికిత్స అనంతరం ఆయన అవయవాలు ఒకొక్కటిగా పనిచేయడం మానేశాయి. చివరికి దిగ్గజ క్రీడా కారుడి శకం ముగిసింది. అశేషాభిమానులను వదిలి పీలే కన్నుమూశాడు.
