ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈనెల 24వ తేదీ నుంచి ఏపీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా మూడు వారాల పాటు సమావేశాలు నిర్వహించే ఆలోచనలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
శాసనసభ సమావేశాల్లో భాగంగా మొదటి రోజు బీఏసీ సమావేశం తర్వాత.. సభను ఎన్ని రోజులు జరపాలి అన్న అంశంపై ఓ నిర్ణయానికి రానున్నారు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఈనెల 28న లేదంటే మార్చి మూడున 2025-26 సంవత్సరానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
బడ్జెట్ సమావేశాలు కావడంతో అసెంబ్లీకి మంత్రులంతా పూర్తిస్థాయి వివరాలతో హాజరు కావాలంటూ ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం. దీంతో.. ఆయా మంత్రుల నుంచి సంబంధిత అధికారులకు ఇప్పటివరకు తమ శాఖలో ఏయే పనులు ఎంత మేరకు జరిగాయి..ఇంకా ఎన్ని జరగాల్సి ఉంది.. కేటాయించిన నిధులు ఎన్ని.. అవసరమైనవి ఇంకా ఎంత అన్న లెక్కలు తీయమంటూ ఆదేశాలు వెళ్లడంతో ఆ పనిలో నిమగ్నమయ్యారు అధికారులు.
ఇప్పటికే కేంద్రం 2025-26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టింది. అందులో రాష్ట్ర ప్రభుత్వానికి ఏయే ప్రయోజనాలు లభించాయి.. ఎంత మేర నిధులు.. ఏయే పథకాల కింద వచ్చే అవకాశం ఉంది..? ప్రాజెక్టులకు ఎంత మేరకు కేటాయింపులు వచ్చాయి అన్న దానిపై ఇప్పటికే కొంత క్లారిటీ వచ్చింది. పూర్తి వివరాలను పంపాల్సిందిగా సీఎంవో నుంచి ఆదేశాలు ఆయా శాఖలకు వెళ్లడంతో ఇప్పటికే ఆ దిశగా కసరత్తు దాదాపు పూర్తి చేశారు అధికారులు. ఫలితంగా బడ్జెట్ రూపకల్పనపై దృష్టి సారించింది కూటమి ప్రభుత్వం.
వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్ట లేకపోయింది. అప్పటి వరకు అధికారంలో ఉన్న గత వైసీపీ ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను అస్తవ్యస్థం చేసిందని ఆరోపించిన కూటమి నేతలు ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తోనే నెట్టుకు వచ్చారు. నవంబర్‌లోనూ మరోసారి అదే పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బడ్జెట్ సమావేశాల నాటికి సుమారు పది నెలలు అవుతుంది. దీంతో.. తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది ఏపీ ప్రభుత్వం.
బడ్జెట్ సమావేశాలకు తేదీలు ఖరారు కావడంతో కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ అంశంపై దృష్టి సారించింది ప్రభుత్వం. ఈనెల 22, 23 తేదీల్లో కొత్తగా ఎన్నికైన సభ్యులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకు కారణం ప్రస్తుత అసెంబ్లీ సభ్యుల్లో కొత్తగా ఎన్నికైన వారు పెద్ద సంఖ్యలో ఉండడమే. దీంతో.. అసెంబ్లీ కమిటీ హాల్‌లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకు శిక్షణా తరగతులు జరగనున్నాయి. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, సభ్యుల విధులు, సభలో సభ్యులు నడుచుకునే తీరు వంటి అంశాలపై ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వనుంది ప్రభుత్వం.
లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ శిక్షణా తరగతులను ప్రారంభించనున్నారు. రెండో రోజు క్లాస్‌లకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై సభ్యులకు విలువైన సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు.