డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీకి ఆహ్వానం అందలేదు. ఇప్పటికీ చాలా మందికి ఇదొక అర్థం కాని పజిల్. ట్రంప్ ప్రమాణస్వీకారానికి అనేక దేశాధినేతలకు వైట్ హౌస్ ఆహ్వానాలు పంపింది. అయితే డొనాల్డ్ ట్రంప్ నకు ఎంతో దగ్గరివాడన్న పేరున్న నరేంద్ర మోడీకి ఆహ్వానం అందకపోవడం అందరినీ ఆశ్చర్య పరచింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భారత ప్రభుత్వం తరఫున విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరవడం కొంతమేర ఊరట కలిగించింది.
కాగా నరేంద్ర మోడీకి ఆహ్వానం అందకపోవడంతో , భారత్ ను ట్రంప్ సర్కార్ చిన్న చూపు చూస్తుందా అనే అనుమానాలు తలెత్తాయి. అయితే ఈ అనుమానాలను కొట్టి పారేసింది ట్రంప్ సర్కార్. డొనాల్డ్ ట్రంప్ తన రెండో హయాంలో భారత్ కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్న సంకేతాలు తాజాగా వెలువడ్డాయి.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో తన తొలి భేటీలో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో సమావేశమయ్యారు. విదేశాంగ మంత్రిగా రూబియో బాధ్యతలు స్వీకరించిన గంటలోపే జై శంకర్‌తో ఆయన సమావేశమవడం విశేషం. కాగా మార్కో రూబియోతో పాటు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మైక్ వాల్జ్‌తోనూ జై శంకర్ భేటీ అయ్యారు. వీరితో జై శంకర్ రెండు దేశాలకు చెందిన అనేక కీలక అంశాలపై చర్చలు నిర్వహించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే కీలకమైన హెచ్ వన్ బీ వీసాలపై ట్రంప్ తన మనస్సులోని మాట బయటపెట్టారు. హెచ్ వన్ బీ వీసాలపై ట్రంప్ శిబిరంలో కొంతమంది అనుకూలంగా ఉంటే మరికొంతమంది ప్రతికూలంగా ఉన్నారు. అర్హత కలిగిన సాంకేతిక నిపుణులు అమెరికాకు రావడానికి హెచ్ వన్ బీ వీసా ఉపయోగపడుతుందని ఎలన్ మస్క్, వివేక్ రామస్వామి అంటున్నారు. కాగా ఇదే విషయమై రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత నిక్కీ హేలీ భిన్నమైన వాదన వినిపిస్తున్నారు. హెచ్ వన్ బీ వీసాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్నారు నిక్కీ హేలీ.
వివాదంగా మారిన హెచ్ వన్ బీ వీసాల అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. తనకు రెండు వాదనలు నచ్చాయన్నారు. అయితే , సమర్ధులైన ప్రజలు అమెరికాకు రావాలని తాను కోరుకుంటున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. దేశ వ్యాపారాలను విస్తరింపచేసేందుకు అమెరికాకు నైపుణ్యం ఉన్న వ్యక్తుల అవసరం ఎంతైనా ఉందన్నారు డొనాల్డ్ ట్రంప్.
వాస్తవానికి హెచ్ వన్ బీ వీసాతో భారతీయ వృత్తి నిపుణులకు అనేక విధాలుగా ప్రయోజనం కలుగుతుంది. హెచ్ వన్ బీ వీసా, నాన్ ఇమ్మిగ్రెంట్ కేటగిరీలోకి వస్తుంది. ఈ వీసా ఆధారంగా టెక్నాలజీ కంపెనీలు , విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటున్నాయి. ప్రధానంగా భారత్, చైనా హెచ్ వన్ బీ వీసాతో అనేక ప్రయోజనాలు పొందుతున్నాయి.