తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన గ్రామసభలు రసాభాసగా మారాయి. నాలుగు సంక్షేమ పథకాల లబ్దిదారుల ఎంపిక కోసం కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామసభలు నిర్వహిస్తోంది. జాబితాలో అనర్హుల పేర్లు ఉన్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలైన అర్హల పేర్లు లేకపోవడంతో ఆందోళన చేస్తున్నారు. రెండోరోజు సైతం నిరసనలు, ఆగ్రహ జ్వాలలతో అధికారులను నిలదీశారు.
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట గ్రామంలో గ్రామసభలు ఉద్రిక్తంగా మారాయి. రేషన్ కార్డుల జాబితాలో తమ పేర్లు రాలేదని ఆర్డీవో, తహసీల్దార్‌లను గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో సభ ఉద్రిక్తంగా మారింది. గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆగ్రహించారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా తమను అర్హులుగా గుర్తించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
సిద్ధిపేట జిల్లా కొండపాక మండలంలో అదే పరిస్థితి నెలకొంది. దుద్దెడ గ్రామంలో ప్రజాపాలన గ్రామసభ రసాభాసగా సాగింది. సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు చేసుకున్న వారి పేర్లు రాకపోవడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు వచ్చి..అర్హులైన వారి పేర్లు రాలేదంటూ అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా, అధికారులు పేదలకు న్యాయం చేసే దిశగా పని చేయడం లేదని మండిపడ్డారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం దుబ్బతండా, బ్రాహ్మణపల్లి, వడ్డేపల్లి, బాపునగర్, జాన్కంపేట్, ఠాణాకలాన్‌లలో గ్రామసభలు గందరగోళంగా మారాయి. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇప్పటి వరకు ఎంట్రీ కాలేదని, తమకు 25 యూనిట్ల విద్యుత్‌తో పాటు, సిలిండర్ సబ్సిడీ రాలేదని అధికారులను ప్రజలు నిలదీశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా అనంతారంలో గ్రామసభ గందరగోళంగా మారింది. సభకు వస్తున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకున్నారు. తమకు పథకాలు రాలేదని, అర్హులకు పథకాలు ఇవ్వరా అంటూ నిలదీశారు. గ్రామస్తుల ఎమ్మెల్యేలను అడ్డుకోవడంతో గ్రామసభ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది.
జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ గ్రామసభ ఆందోళన మయంగా మారింఇ. దరఖాస్తు పత్రాలను గ్రామస్థుడు ఏకంగా విసిరి కొట్టాడు. ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు జరిగాయంటూ..ఆ వ్యక్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల కేటాయింపులో అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇళ్ల కేటాయింపులో పారదర్శకత లేదని, ఉన్నవారికే ఇళ్లు ఇవ్వడంతో ఎక్కడ న్యాయం జరిగిందని మండిపడ్డారు. దరఖాస్తు పత్రాలను తహసీల్దార్ టేబుల్ మీద గ్రామస్థుడు విసిరికొట్టాడు.
సిద్ధిపేట జిల్లా గడిచెర్లపల్లి గ్రామసభలో పాల్గొన్న ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రజాపాలన అంటూ ఏడాది క్రితం ప్రజల నుంచి వివిధ పథకాల అమలుకు దరఖాస్తు తీసుకున్నారని..నేటికీ వాటికి దిక్కులేదని మండిపడ్డారు. పోలీసుల నిర్భందాల నడుమ రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించడం సిగ్గచేటని అన్నారు. దమ్ముంటే సీఎం గ్రామ సభలకు హాజరు కావాలని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు..పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి. అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు ఇస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని…ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. పేదలందరికీ రేషన్ కార్డులను మంజూరు చేస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు గ్రామసభలో మంత్రి మాట్లాడారు.