పుణ్యభారతావనిలో ప్రతి పవిత్రవంతమైనది పూజార్హనీయమే అని పెద్దలు చెబుతారు. చెట్టులు, పుట్టలు, పువ్వులు, నదులు, నీళ్లు, గోవులు, పాములు…ఇలా అన్నింటిలో భగవత్ స్వరూపాన్ని చూసి ఆరాధిస్తాం. ఎవరిని చూస్తే..ఎవరు హాని చేస్తారో.. అని మృగాలు, సర్పాలతో మనుషులు పోరాటాలు చేసిరావల్సిన పరిస్థితులు వస్తాయి. అయితే, ఆ సర్పాన్నో, జంతువునో.. బుట్టలోనో, బోనులోనో పెట్టి.. అటవీ ప్రాంతంలోనో, జూ పార్క్ ల్లోనో అప్పగిస్తాం తప్ప హతమార్చం. ఇంతటి పవిత్ర దేశంలో నదీమ తల్లుల ఆరాధనకు ఎంతో పేరుంది. దేశంలో దక్షిణాది ప్రజలు నదులు పుష్కరాలకు పెద్ద పీట వేయగా, ఉత్తరాది ప్రజలు కుంభమేళాలకు పెద్దపీట వేస్తారు. ఇప్పుడు అలహాబాద్ ప్రయాగ్ రాజ్ లో గంగ, యమున, సరస్వతీ సంగమ ప్రాంతమైన త్రివేణీ సంగమం వద్ద మహాకుంభమేళా వేడుక జరుగుతోంది. పుణ్యస్నానాలతో మహా కుంభమేళా శోభిల్లుతోంది.
మహా కుంభమేళా పుణ్యస్నానాల ఘట్టంగా వైభవోపేతంగా ఇక్కడ జరుగుతుండగా, అర్జెంటీనా దేశంలో సరండీ నది సడెన్ గా రుధిర జలాలుగా మారిపోయింది. దేవర సినిమాలో ఎర్ర సముద్రం గురించి ఆ చిత్ర హీరో ఏమంటాడు..చేపలకన్నా కత్తులను, నెత్తరును ఎక్కువ చూసినందు వల్లే ఇది ఎర్ర సముద్రం అయ్యిందని కదా..! డైలాగ్. అర్జింటినాలో అంత అర్జంట్ గా నది అంత ఎరుపు ఎక్కిపోవడంతో.. ఇది పాపపు పనుల ఫలితమా..? లేకేదైనా కారణమా..? అనే చర్చలు వచ్చాయి. నరకలోకంలో వైతరణి అనే మహా భయంకర నది ఉంటుందని…సలసల మరిగే రక్తం అందులో నీరులా ప్రవహిస్తుందని, ఆ నది దాటితే కాని పుణ్యలోకాలకు వెళ్లలేమని పురాణాలు చెబుతున్నాయి. పుణ్యాలు చేసి గోదానాలు చేసిన వారిని గోవులు ఈ గండం నుంచి గట్టెక్కిస్తాయని పురాణ ప్రముఖులు తెలియజేస్తున్నారు. అయితే, ఆ వైతరణి ఇక్కడికే వచ్చేసిందా.. అని కొందరు భయాందోళనలు వ్యక్తం చేశారు. ఎందుకంటే.. ఈ తరహా ఘటనలకు సంబంధించి..పూర్వం నుంచి ఎన్నో కథలు వింటున్నాం కదా.
చాలాకాలం క్రితం.. ఆండిస్ అర్జెంటీనాలో అకాన్ కాగువ పర్వత ప్రాంతం గురించి ఎన్నో ఆసక్తికర, భయంకర వార్తలు వచ్చేవి. ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికా పశ్చిమ అంచున, వెనిజులా నుండి చిలీ వెంబడి దక్షిణ అమెరికా దక్షిణం వరకు, ఈక్వెడార్, పెరూ బొలీవియా మీదుగా విస్తరించి ఉన్నాయి. ఈక్వెడార్ ఆండీస్‌లోని చింబోరాజో శిఖరం, మౌంట్ చింబోరాజో ఒక నిద్రాణమైన అగ్నిపర్వతం. ఇది చివరిసారిగా పది శతాబ్దాల క్రితం విస్ఫోటనం చెందిందని చరిత్ర చెబుతోంది. ఆండీస్ పర్వతాల అంత పురాతన పర్వతాలు ఇంకేవీ లేవంటే అతిశయోక్తి కాదు. 50 మిలియన్ సంవత్సరాలకు పూర్వం అనేక పర్వత గొలుసులు సమాహారంగా ఇవి ఏర్పడినట్టు ప్రపంచ చరిత్ర వెల్లడిస్తోంది. ఈ ఆండిస్ అకాన్ కాగువ పర్వత ప్రాంతం వైపు వెళ్లిన ఎన్నో లోహ విహంగాలు అదృశ్యమయ్యాయయని, అవి ఎక్కడ కనబడకుండా పోయాయి అనేది ఎప్పటికీ తేలలేదని చాలామంది పెద్దలు ఇదివరలో కథలు, కథలుగా చెప్పేవారని.. మనకు పుస్తకాల ద్వారా తెలుస్తోంది. ఇదేకాక అర్థరాత్రి దాటాక.. తెల్లవారక మునుపు ఏదో హాహాకారాలు, భయంకర శబ్దాలు వచ్చేవని.. ఈ ప్రాంతంలోని నరకలోకం ఉందనే కథనాలు ఆసక్తికరంగా తెలియజేసుకునేవారని ఆయా పుస్తకాలు చెబుతున్నాయి. అయితే.. ట, ట అనే మాటలు తప్ప నిజానిజాలు ఎవరికీ తెలియవు.
ఇప్పుడు అర్జెంటినాలో సరండీ నది రక్తంలా మారడంతో.. ఈ పాత కథలన్నీ బయటకు వస్తున్నాయి. ఆ పాత కథల్లోనే కొన్నింటిని గమనిస్తే.. అవన్నీ కల్పితాలు, కట్టుకధలనే తేటతెల్లం అవుతుంది. పూర్వం తరచు అందరూ చెప్పుకునే కథ.. ఓ మహా ధైర్యవంతుడు, సాహసవంతుడు.. దెయ్యం అనే మాట వింటేనే కయ్యానికి సిద్దం అయ్యేవాడు. దెయ్యాలున్నా.. తనకేం భయం లేదని అన్నాడు. అయితే, అర్థరాత్రి అమావాస్య నాడు శ్మశానం నడిబొడ్డున దెయ్యం మాదిరి ఊడలతో ఉన్న మర్రి చెట్టుకు మేకు కొట్టి రావాలి.. అప్పుడే నువ్వు ధైర్యవంతుడవని, దెయ్యాలు లేవని తాము నమ్మతామని పందెం కడతారు. ఈ వ్యక్తి.. ఆ వ్యక్తుల సవాల్ స్వీకరించి.. అర్థరాత్రి, అమావాస్య నాడు ఆ చెట్టు వద్దకు వెళ్లి.. చెట్టుకు మేకు కొడతాడు. అయితే, తన పంచెను సవరించుకోవడంలో, ఆ చీకట్లో.. చెట్టుకు పంచెతో పాటు మేకు కొడతాడు. తన పని పూర్తి అయ్యి వెనక్కు తిరిగి రాబోతుంటే.. ఆ పంచె సర్రున చిరిగి.. ఆ నిశీది వేళ పెద్ద శబ్దంలా వినిపించడంతో.. దాన్ని దెయ్యంగానే భావించి.. అక్కడ నుంచి పరుగు పరుగున వచ్చి.. దెయ్యాలు న్నాయనే వారి వద్దకు వచ్చి.. తనదే తప్పని దెయ్యాలున్నాయని చెబుతాడు. ఇందుకే, భయమే దెయ్యంలా పట్టి పీడిస్తుందనే విషయం అర్థం చేసుకోవాలని చాలామంది చెబుతూంటారు.
ఇంతకీ ఈ కథలో మాదిరే.. అర్జింటినా సరండీ నది రక్తధారలతో నిండిపోవడానికి దెయ్యాలు, భూతాలు కారణం కాదు. నరకలోకాలు, వైతరణీ నదులు, రక్త తటాకాలు అస్సలు కాదు. బ్యూనస్ ఎయిర్స్ నగర శివారులోని నది ఎర్రగా, భయానంగా మారడంతో స్థానికులు బెంబేలెత్తారు. దీంతో, డిటెక్టివ్ లు, అధికారులు, ధైర్యవంతులు, సాహసీకులు అందరు రంగంలోకి దిగి.. దీని నిగ్గు తేల్చేశారు. సరండీ నది ఎన్నో పారిశ్రామిక వాడలు, మురికి వాడల మీదుగా ప్రవహిస్తోంది. చివరకు రియోడిల ప్లాటా వైపుగా సాగి సముద్రంలో కలిసిపోతోంది. ఫ్యాక్టరీల నుంచి వచ్చే వ్యర్థాలను ఈ నదిలో పారవేస్తున్నారు. ఇదేకాక, ప్రమాదకరమైన పారిశ్రామిక వ్యర్థాలను కాల్చివేసి, ఆ ఎర్రటి మిశ్రమాలను సైతం అధికారులు ఇందులోనే కలిపి వేస్తున్నారు. ఈ ఫలితంగా నదిలో కాలుష్యం పెరిగి ఎర్రగా మారిపోయింది. కొందరు పరిశ్రమల యజమానులు గుట్టు చప్పుడు కాకుండా ఈ తంతు సాగిస్తుండడంతో.. సరండీ నది రక్త జలాల మాదిరి దర్శనమిచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అధికారులు నది నుంచి శాంపిల్స్ సేకరించి, కాలుష్య కారకాలపై పరీక్షలు చేయిస్తున్నారు.
—————