29.2 C
Hyderabad
Thursday, February 6, 2025
spot_img

కనుమ నాడు మినుమ తప్పక తినాలా..?

ఏటేటా ఎన్నో పండువలు వస్తాయి. ఈ పండగల్లో ఎన్నెన్నో వేడుకలు, సంబరాలు చేసుకుంటాం. అయితే, పండగల్లో రారాజు పండువగా కీర్తి ప్రతిష్టలు పొందిన మకర సంక్రాంతి పండగలో.. అన్ని పండువల్లో ఉండే వేడుకలతో పాటు అదనంగా మరెన్నో వినూత్న వేడుకలు, చిత్ర, విచిత్ర సంబరాలు ఉంటాయి. అన్ని పండువలకు భిన్నంగా మూగజీవాల ఆరాధన ఈ పండుగలో కన్పిస్తుంది. రైతన్నలకు ఎల్లవేళలా అన్నివిధాలుగా వెన్నుదన్నుగా ఉండే పశువుల పేరిట ఈ పండువ నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగదినాల్లో మూడో పండువగా పేరొందిన కనుమ నాడు ఈ వేడుక జరుగుతుంది.

గోవు మా లక్ష్మికి కోటి దండాలు అంటూ నారీమణులు గోమాతలకు పసుపురాసి కుంకుమపెట్టి పూజలు చేసే ఘట్టాలు మకర సంక్రాంతి పర్వదినాల్లో కన్పిస్తాయి. అయితే, పశు, పక్ష్యాదులకు ప్రాధాన్యం ఇచ్చే పండువ దినం సంక్రాంతి పర్వదినాల్లో మూడో రోజు. ఇదే కనుమ పండువ. ప్రత్యేకంగా పశువుల పండువగా కీర్తింపబడే కనుమ పండుగ అంటే అన్నదాతలకు అమిత ఇష్టం. వ్యవసాయ పనుల్లో రైతన్నలకు చేదోడో వాదోడుగా ఉంటూ ధాన్యలక్ష్మిని అన్నదాత ఇంట చేర్చే ధన్యప్రాణులుగా బసవన్నలు కీర్తి ప్రతిష్టలు పొందాయి. అందుకే రైతన్నకు పశువులంటే అంతా ప్రాణం.

కనుమ పండువ నాడు అన్నదాతలు పశువులను అందంగా అలంకరించి, పుష్కలంగా మేత అందజేసి అపురూపంగా చూసుకుంటారు. ప్రతి నిత్యం పశువులకు రైతన్నలు స్నానాదికాలు నిర్వహిస్తారు. చెరువుల్లో స్వేచ్ఛగా విహరించేలా పశువులను వదిలేస్తారు. జలక్రీడలు పూర్తయ్యాక పశువులను ఇళ్లకు తీసుకొచ్చి మేత అందజేస్తారు. అయితే, కనుమ పండువ నాడు ఎంతో సంబరంగా పశువులను అలంకరిస్తారు. రాజసం ఉట్టిపడేలా ఉండే పశువుల కొమ్ములను బాగా శుభ్రం చేసి రంగులతో తీర్చిదిద్దుతారు. పశువుల మెడలో మువ్వల పట్టీలు పెట్టి, కొమ్ములకు తొడుగులు తొడిగి, చక్కని నూతన వస్త్రాలతో అలంకరించి.. పశుశోభను తిలకించి రైతులు మురిసిపోతారు.

ఏడాదంతా తమతో పాటు కష్టపడి పనిచేసిన పశువులను ఆప్యాయంగా ఆరాధించడమే కాకుండా, పక్షి నేస్తాలపైనా రైతులు ప్రేమ కురిపిస్తారు. ధాన్యపు సిరులతో ఇల్లంతా కళకళలాడుతుండగా, ఇళ్ల ముందు ధన్యపు కంకులు కట్టి విహంగాలకు ఆహ్వానం పలుకుతారు.

పొలం దున్ని, విత్తనాలు విత్తి, పంటలు పండించి వాటిని ఇంటికి చేర్చడంలో పశువుల ప్రాధాన్యం ఎంతో అందరికీ తెలిసిందే. పశువులు రైతులకు సహాయకారిగా ఉండడమే కాకుండా అనేక విధాలా ఆదాయ వనరుగా ఉంటాయి. రైతుల పాడి పరిశ్రమకు దోహదపడేది పశువులే. పశు విసర్జితాలు రైతన్నకు ఎరువులుగా ఉపయోగ పడతాయి. చాలామంది రైతులు పశువులను జంతువులుగా చూడరు. తమ కుటుంబ సభ్యునిమాదిరి ఆదరించి గౌరవిస్తారు.

పశువులను ప్రేమపూర్వకంగా ఆరాధించడమే కాకుండా… పశువులను తమకందించిన దైవాలకు కనుమ పండువ నాడు రైతులు పూజలు చేస్తారు. గ్రామ దేవతలకు, పశువుల దైవాలుగా భావించిన కొన్ని దేవతా విగ్రహాలకు రైతులు పూజలు చేస్తారు. మూగజీవాలు మంచి ఆరోగ్యంతో ఉండాలని, తాము చల్లగా ఉండాలని గ్రామ దేవతలకు పూజలు చేసి, పొంగలి నైవేద్యాలు సమర్పిస్తారు.

కనుమ పండువ ప్రధానంగా మూగజీవాలకు, రైతన్నలకు సంబంధించిందే అయినా, యావత్ ప్రజలు సంక్రాంతి సంబరాల్లో భాగంగా, సంక్రమణ తృతీయదిన పండువగా చేసుకుంటారు. కనుమ నాడు మాంసాహారులు తప్పక మాంసాహారాన్ని భుజిస్తారు. కనుమ నాడు మాంసాహారం తింటే మంచిదని చాలామంది విశ్వసిస్తారు. అయితే, శాఖాహారులకు మాంసాహారం తినడం నిషిద్ధం అయినందున, మాంసకృతులు ఉన్న శాఖాహారాన్ని శాఖాహారులు భుజిస్తారు. మినుములో మాంసకృతులు ఉంటాయి. అందుకే, కనుమ పండువ నాడు ఖచ్చితంగా గారెలు, ఆవడలను తినాలని చెబుతారు. కనుమ నాడు మినుము తినాలనే సామ్యం అందుకే వచ్చిందని పెద్దలు చెబుతున్నారు.

ఇప్పుడు మూడు రోజుల పండువగా సంక్రాంతిని నిర్వహించుకుంటున్నా..పూర్వం పంటల పండగను అయిదు రోజులపాటు చేసుకునే వారని పెద్దలు వెల్లడిస్తున్నారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ, బొమ్మల కొలువు అనే పేరిట అయిదు రోజుల పండగగా మకర సంక్రమణ వేడుకలు చేసుకునేవారని అంటున్నారు. ముక్కనుమ రోజున నూతన వధువులు గౌరీమాతకు పూజలు చేసి అనంతరం బొమ్మలు కొలువులు పెట్టడం పూర్వాచారమని తెలియజేస్తున్నారు.

—————

Latest Articles

‘ఎటర్నల్‌’ గా జొమాటో రీ బ్రాండ్‌.. కొత్త లోగో

ఇండియన్‌ ఫుడ్‌ అండ్‌ గ్రాసరీ డెలివరీ ప్లాట్‌ఫామ్‌.. జొమాటో తన పేరు మార్చుకుంది. కంపెనీ ప్రతినిధులు ఈ విషయాన్ని గురువారం వెల్లడించారు. జొమాటో కాస్తా 'ఎటర్నల్‌' గా మారింది. కొత్త లోగోను కూడా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్