భారతదేశం ప్రధాన సముద్ర శక్తిగా అవతరిస్తోందని, ప్రపంచంలో విశ్వసనీయమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తింపు పొందుతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత నౌకాదళ అమ్ముల పొదిలో మరో మూడు అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు, ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను నౌకాదళంలో చేర్చారు. ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు.
మూడు నౌకాదళ యుద్ధనౌకలను ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. భారతదేశం ఎప్పుడూ బహిరంగ, సురక్షిత, సమగ్ర, సంపన్నమైన ఇండో-పసిఫిక్ ప్రాంతానికి మద్దతు ఇస్తుందని అన్నారు.
డిస్ట్రాయర్, ఫ్రిగేట్ , జలాంతర్గామిని ఒకేసారి ప్రారంభించుకున్నామని .. ఇవన్నీ భారత్‌లో తయారైనవే అని చెప్పారు. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం దేశాన్ని బలంగా , స్వావలంబనగా మార్చిందని ప్రధాన మంత్రి అన్నారు.
“మాదక ద్రవ్యాలు, ఆయుధాలు , ఉగ్రవాదం నుండి సముద్రాన్ని రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలి . దానిని సురక్షితంగా, సంపన్నంగా మార్చాలి. భారతదేశం ప్రధాన సముద్ర శక్తిగా మారుతోంది. విశ్వసనీయ బాధ్యతాయుతమైన భాగస్వామిగా గుర్తించబడుతోంది” అని మోదీ చెప్పారు.
సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని మోదీ చెప్పారు. గత పదేళ్లలో 33 యుద్ధ నౌకలు, ఏడు జలాంతర్గాములు నేవీలో చేరాయని వివరించారు. రక్షణరంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటిందని మోదీ చెప్పారు. మన రక్షణ పరికరాలను వందకు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని అన్నారు.
ఐఎన్‌ఎస్ సూరత్
పీ15బీ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధ నౌక. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం. ఈ యుద్ధ నౌకలో అధునాతన ఆయుధ – సెన్సర్ వ్యవస్థలు ఉన్నాయి. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్ధ్యం దీని సొంతం
ఐఎన్‌ఎస్ నీలగిరి
పీ17ఏ స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధ నౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారుచేశారు.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్
పీ75 కింద రూపొందిస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో ఈ జలాంతర్గామిని అభివృద్ధి చేశారు.