ఏపీలో కోడి పందాలు జోరుగా సాగుతున్నాయి. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సందర్భంగా జరిగే కోడి పందాలు.. ఈ ఏడాది అంతకు మించి అన్నట్లుగా జరుగుతున్నాయి. ఎక్కడా తగ్గేదేలే అంటూ పందాలు కాస్తున్నారు పందెం రాయుళ్లు. ఇక పందెం కోళ్లు కాళ్లకు కత్తులు కట్టుకుని మరీ బరిలో దిగుతున్నాయి. మరోవైపు పందెం రాయుళ్ల జోరు మామూలుగా లేదు. వేలు, లక్షల రూపాయలు దాటి ఇప్పుడు కోట్లలో పందేలు కాసే స్థాయికి చేరారు.
ఏకంగా కోటి రూపాయాలకు పైగా పందెం కాయడం చర్చనీయాంశమైంది. తాడేపల్లిగూడెంలో కోడి పందెం బెట్టింగ్ హాట్ టాపిక్ అయింది. కోడి పందెం బరిలో ఏకంగా కోటీ 25 లక్షల పందెం కాయడం చర్చకు దారి తీసింది. ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావుకు చెందిన నెమలి పుంజు విజేతగా నిలిచింది. ఈ పందెనికి బెట్టింగ్ రాయుళ్లు భారీగా పందేలు వేసుకున్నారు.
కుక్కుట శాస్త్ర ప్రకారం కోటి రూపాయల పందేనికి ముహూర్తం ఫిక్స్ చేశారు నిర్వాహకులు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు ఈ బరిలోకి దిగాయి. రూ.కోటి 25 లక్షలతో రెండు పుంజులను పందెంలోకి దింపారు నిర్వాహకులు. ఇక, కోటి రూపాయల పందెం వీక్షించడానికి ప్రజలు, పందెం రాయుళ్లు భారీగా తరలివచ్చారు. ఈ పందేనికి భారీగా బెట్టింగులు కాశారు. హోరాహోరీగా సాగిన బరిలో గుడివాడ ప్రభాకర్ నెమలి పుంజు విజేతగా నిలిచింది. దీంతో గెలిచిన వారు సంబరాలు చేసుకున్నారు.