కూతురుని వేధిస్తున్నాడన్న కోపంతో యువకుడి ఇంటికి నిప్పు పెట్టాడో వ్యక్తి. ఈ ఘటనలో యువకుడి తండ్రితో పాటు నాలుగేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. సికింద్రాబాద్ అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధి గోపాల నగర్‌లో జరిగిందీ ఘటన.
వివరాల్లోకి వెళ్తే.. గోపాల నగర్‌లో నివాసం ఉంటున్న ప్రదీప్.. అదే ప్రాంతానికి చెందిన స్వాతి అనే యువతిని ప్రేమించమని వేధిస్తున్నాడు. తరచూ ఇబ్బందులకు గురి చేస్తుండడంతో యువతి బంధువులు ప్రదీప్‌ను హెచ్చరించారు. అయినా ప్రదీప్ తీరు మార్చుకోలేదు. ఈ క్రమంలో ప్రదీప్… స్వాతికి పూలు పంపించాడు. స్వాతి జోలికి రావొద్దని చెప్పినా వినడం లేదని ఆగ్రహానికి గురైన స్వాతి బాబాయ్ వివేక్ నంద .. డీజిల్ తీసుకుని ప్రదీప్ ఇంటికి వెళ్లాడు. డీజిల్ పోసి ఇంటి తలుపులకు నిప్పు పెట్టి అనంతరం పరారయ్యాడు.
ఆ సమయంలో ప్రదీప్ తండ్రి ప్రకాశ్ ఇంట్లోనే ఉండడంతో నిప్పంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో పక్క ఇంట్లో ఉంటున్న చాందిని అనే నాలుగేళ్ల చిన్నారికి కూడా గాయాలయ్యాయి. ప్రకాశ్‌ను గాంధీ ఆస్పత్రికి తరలించగా.. చాందినిని కొపంల్లిలోని వెల్‌నెస్ సెంటర్‌కు తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
ప్రకాశ్, ఆయన తండ్రి కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. స్వాతి రైల్వే డిగ్రీ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. హత్యాయత్నానికి పాల్పడిన వివేక్ నంద వాహన విక్రయదారుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.