తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (DCA)రాష్ట్రంలో రెండు చోట్ల దాడులు నిర్వహించింది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గౌడవెల్లిలో APIల అక్రమ నిల్వ, విక్రయాలను గుర్తించింది. కోక్రియేట్ గ్లోబల్ టెక్నాలజీస్ సంస్థలో డ్రగ్ లైసెన్స్ లేకుండా APIలు నిల్వ చేసినట్లు తేలింది. 32 HDPE డ్రమ్‌లలో ఉన్న APIలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న స్టాక్‌లో 13 డ్రమ్‌ల ఇట్రాకోనజోల్, 19 డ్రమ్‌ల క్లోపిడోగ్రెల్ బైసల్ఫేట్ ఉన్నాయి. పట్టుబడిన APIల మొత్తం విలువ రూ.34 లక్షలు. కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని DCA తెలిపింది.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం భీమారం గ్రామంలో లైసెన్స్ లేని మెడికల్ షాపుపై DCA దాడి చేసింది. కె. నర్సయ్య అక్రమంగా మెడికల్ షాపు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. 31 రకాల మందులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మందుల విలువ రూ.55 వేలుగా అంచనా. యాంటీబయాటిక్స్, యాంటీ అల్సర్, నొప్పి నివారణ మందులు సహా పలు ఔషధాలు పట్టుబడ్డాయి. లైసెన్స్ లేకుండా మందుల విక్రయం చేస్తే 5 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని DCA హెచ్చరించింది.


