హైదరాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా ‘ఆపరేషన్ కవచ్’ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. రాత్రి 10 గంటల నుంచి 12 గంటల వరకు డ్రైవ్‌లో భాగంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నంబర్ ప్లేట్ల ట్యాంపరింగ్, నకిలీ నంబర్ ప్లేట్లు ఉన్న వాహనాలపై ఫోకస్ చేశారు.
మొత్తం 12,098 వాహనాలను తనిఖీ చేశారు పోలీసులు. 1,406 ట్యాంపరింగ్ చేసిన నంబర్ ప్లేట్లు, 1,132 నంబర్ ప్లేట్ లేని వాహనాలు, 69 నకిలీ నంబర్ ప్లేట్ వాహనాలను గుర్తించారు. నిబంధనలు ఉల్లంఘించిన 2,149 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటిలో 2,046 ద్విచక్ర వాహనాలు, 52 కార్లు, 51 ఆటోలు ఉన్నాయి. తనిఖీలను స్వయంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్( V. C. Sajjanar) పరిశీలంచారు. వాహనదారులతో మాట్లాడి సరైన నంబర్ ప్లేట్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.
నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్‌ను సాధారణ ట్రాఫిక్ ఉల్లంఘనగా కాకుండా చీటింగ్, ఫోర్జరీ కేసుల కింద చర్యలు తీసుకుంటామని సజ్జనార్ హెచ్చరించారు. భవిష్యత్తులో అన్ని రకాల వాహనాలపై దశల వారీగా ఆపరేషన్ కవచ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.


