తెలంగాణ కాంగ్రెస్ కార్యవర్గ కూర్పుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇందుకు సంబంధించి టీపీసీసీ గత కొంత కాలంగా విస్తృతంగా కసరత్తులు చేస్తోంది. మరి.. ఇలాంటి వేళ సంక్రాంతి తర్వాతైనా ఆఫీస్ బేరర్ల నియామకం ఉంటుందా..? కార్యవర్గంలో ఉన్న పోస్టులు ఏంటి..? పదవులు ఆశిస్తున్న వారిలో ఎవరెవరు ఉన్నారు..?
టీపీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టి నాలుగు నెలలు అవుతోంది. ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టడంతోనే అప్పటి వరకు ఉన్న కమిటీలు అన్నీ రద్దైపోయాయి. దీంతో.. నూతన కార్యవర్గంలో కొత్తగా ఎవరెవర్ని పదవులు వరిస్తాయి.. ఎవరికి ఛాన్స్ ఇస్తారు అన్నదానిపై పీసీసీ విస్తృతంగా చర్చిస్తోంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. గత కార్యవర్గానికి భిన్నంగా నూతన కమిటీలు ఉండాలని భావిస్తున్నారట టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్. బీసీ సామాజిక వర్గానికి చెందిన మహేష్‌గౌడ్ పీసీసీ చీఫ్‌గా ఉండగా.. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ర్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ ఛైర్మన్, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధుల నియామకం చేపట్టాల్సి ఉంది. అయితే.. గతంలో అంటే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్న సమయంలో సీనియర్ నేతలు కోరిన పదవులు కట్టబెట్టారన్న టాక్ ఉంది. అందుకే జాబితా చాంతాడంత ఉందన్న విమర్శలున్నాయి. ఈ పరిస్థితుల్లో తన కార్యవర్గం పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారట మహేష్ కుమార్ గౌడ్.
సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకొని కార్యవర్గ కూర్పులో అన్ని వర్గాలకు అవకాశం దక్కేలా పీసీసీ స్పెషల్ ఫోకస్ పెట్టిందట. జరుగుతున్న ప్రచారం ప్రకారం ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆశిస్తున్నారట. ఇక, వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు గతంలో ఐదు ఉండగా… ఇప్పుడు కేవలం నాలుగుకే పరిమితం చేయాలని ఆ పార్టీ భావిస్తోందట. అందులో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఓసీ సామాజిక వర్గానికి అందులోనూ ఓ మహిళకు అవకాశం ఇవ్వాలని యోచిస్తున్నారట. గతంలో జగ్గారెడ్డి, అజారుద్దీన్, అంజన్ కుమార్ యాదవ్, గీతారెడ్డి, మహేష్‌గౌడ్ ఉండగా.. ప్రస్తుతం పార్టీ అధికారంలో ఉండడంతో పోటీ ఎక్కువగా ఉందట.
ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, అడ్లూరి లక్ష్మణ్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్, మైనార్టీల తరఫున ఫిరోజ్‌ఖాన్, రెడ్డి సామాజిక వర్గం నుంచి వంశీచందర్‌రెడ్డి, చామల కిరణ్‌కుమార్ రెడ్డి పదవులను ఆశిస్తున్నారు. మహిళా నేతల్లో సునీతారావు, సరిత తిరపతయ్య పేర్లు విన్పిస్తున్నాయి. వైస్ ప్రెసిడెంట్ నియామకాల విషయంలో పార్లమెంటు నియోజకవర్గాల వారీగా మొత్తం 17 మందిని నియమించే అవకాశాలు కన్పిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుల అంశానికి వస్తే 33 జిల్లాలతోపాటు ఖైరతాబాద్, సికింద్రాబాద్‌లను సైతం కాంగ్రెస్ పార్టీ కొత్తగా కలపాలని భావిస్తోంది. అంటే మొత్తం 35 మందికి అవకాశం దక్కుతుందన్న వార్తలు వస్తున్నాయి.
వీటికితోడు జిల్లాకు ఒక ప్రధాన కార్యదర్శి చొప్పున పీసీసీ కార్యవర్గంలోకి తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోందట. ఇందులో మరో కీలకమైన పోస్ట్ ట్రెజరర్. పార్టీకి సంబంధించి ఫండింగ్, ఖర్చులు మొత్తం చూసే పోస్టు ఇది. ఈ ఛాన్స్ తనకు ఇవ్వాలని కోరుతున్నారు హైదరాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి. వాస్తవానికి పీసీసీ చీఫ్, ప్రచార కమిటీ ఛైర్మన్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, వైస్ ప్రెసిడెంట్లు, ప్రధాన కార్యదర్శులు మాత్రమే ఆఫీస్ బేరర్లుగా భావిస్తుంది కాంగ్రెస్ పార్టీ.
పార్టీ అధికారంలో లేకపోయినా కష్టపడింది ఎవరు..? కీలక నాయకులుగా సమర్థవంతమైన పాత్ర పోషించింది ఎవరు..? క్షేత్రస్థాయిలో బాగా పనిచేసిన నాయకులు.. ఇలా అన్ని అంశాలను, సామాజికవర్గాల వారీగా పరిశీలించి అతి త్వరలోనే అంటే సంక్రాంతి వరకు ఆయా పదవులను భర్తీ చేయాలని భావిస్తోందట టీపీసీసీ. అలా చేయడం ద్వారా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఆఫీస్ బేరర్లకు పార్టీ కార్యక్రమాల తీరు, క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ అవగాహన వస్తుందని భావిస్తున్నారట. మరి.. కొత్త పదవుల్లో ఎవరెవరికి అవకాశం దక్కుతుందన్నది ఆసక్తికరంగా మారింది.