పార్టీ ఫిరాయింపులపై బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్‌గా ఆలోచిస్తోందా..? సంక్రాంతి తర్వాత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉందా..? అంటే అవునన్న సమాధానం విన్పిస్తోంది. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి ఏం చేయాలన్న దానిపై గులాబీ పార్టీ అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన తమ ఎమ్మెల్యేలపై వేటు వేసే వరకు ఊరుకునేదే లేదంటోంది బీఆర్ఎస్. గులాబీ పార్టీ నుంచి గెలిచి హస్తం పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేటు పడుతుందని చెబుతోంది గులాబీ పార్టీ. ఈ విషయంలో ఇప్పటికే హైకోర్ట్ ఇచ్చిన డైరెక్షన్‌ను ప్రస్తావిస్తోంది. రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన సూచనలను తెలంగాణ స్పీకర్ అమలు చేయాల్సిందేనని అంటోంది. ఒక వేళ ఈ అంశంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరింత తాత్సారం చేస్తే ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లాలని పార్టీ డిసైడైంది.
వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కారు పార్టీకి 39 సీట్లు దక్కాయి. కంటోన్మెంట్‌కు చెందిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా.. అసెంబ్లీలో బీఆర్ఎస్ బలం 38కి తగ్గింది. ఇదే సమయంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీలోకి ఏకంగా 10 మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయించారు. నిబంధనల ప్రకారం బీఆర్‌ఎస్ ఎల్పీని కాంగ్రెస్ ఎల్పీలో విలీనం చేయాలంటే 26 మంది కారు పార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉండాలి. కానీ, చేరింది పది మంది మాత్రమే. దీంతో.. అది సాధ్యం కాలేదు.
ప్రధానంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది బీఆర్ఎస్. ఆయన పార్టీ ఫిరాయించి మరీ ఎంపీగా పోటీ చేయడంపై అప్పట్లోనే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మూడు నెలల్లో చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ గుర్తు చేస్తోంది. ఈ విషయంలో మణిపూర్ ఎమ్మెల్యేల అంశం సహా మరికొన్ని తీర్పులను ప్రస్తావిస్తోంది గులాబీ పార్టీ.
ఈ మొత్తం వ్యవహారంలో శాసనసభ స్పీకర్ నిర్ణయంపై సంక్రాంతి సెలవుల వరకు వేచి చూసే ధోరణి అవలంభించాలని యోచిస్తోంది బీఆర్‌ఎస్. ఆ తర్వాత ఇప్పటికే ఉన్న పిటీషన్లకు తోడు కొత్తగా మిగిలిన సభ్యులను చేర్చి సుప్రీంలో మరో పిటీషన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి న్యాయనిపుణుల సలహాలు తీసుకుంటోంది. సీనియర్ లాయర్లను ఏర్పాటు చేసుకున్న గులాబీ పార్టీ.. ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేంతవరకు విశ్రమించ వద్దని నిర్ణయించింది.
మరి.. గులాబీ పార్టీ ఆశలు ఫలిస్తాయా…? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు పడుతుందా..? చూడాలి మరి.