దావోస్‌లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల సీఎంలు స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ ఎయిర్‌పోర్టులో కలుసుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అక్కడ కాసేపు ముచ్చటించుకున్నారు. రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది. రేవంత్‌రెడ్డి వెంట తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు ఉన్నారు. ఇక, చంద్రబాబు వెంట ఏపీ మంత్రి నారా లోకేశ్, కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ఉన్నారు.
మరోవైపు జ్యురిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్‌పోర్టులో యూరప్ తెదేపా ఫోరం సభ్యులు, ఎన్‌ఆర్‌ఐలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు, రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అధికారులు ఉన్నారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఎన్‌ఆర్‌ఐ తెదేపా నేతలు ఫొటోలు దిగారు. నేడు జ్యురిచ్‌లో పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు బృందం సమావేశం కానుంది.