ఏపీలో వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 9వ రోజు చేపట్టిన సహాయక చర్యలపై కలెక్టర్లు, ఉన్నతాధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు ఉన్న ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పరిస్థితులపై ఆరా తీశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కాకినాడ, ఏలూరు, తూర్పుగోదావరి కలెక్టర్లతో మాట్లాడారు.
ఏజెన్సీ ప్రాంతాల్లో భారీ వర్షాలు, వరదలపై మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. బుడమేరు వరద నీటి ప్రభావం కొంత మేరకు తగ్గిందని.. సాయంత్రానికి దాదాపు అన్ని ప్రాంతాలు వరద నుంచి బయటపడతాయని చెప్పారు. వాహనాలు, సిబ్బంది వెళ్లలేని ప్రాంతాల్లో డ్రోన్లు ఉపయోగించాలని సూచించారు. విజయవాడలో కొన్ని ఇళ్లు మినహా విద్యుత్ పునరుద్ధరణ పూర్తయిందని అధికారులు ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా తెలిపారు. అంటు వ్యాధులు ప్రబలకుండా పూర్తిస్థాయిలో పారిశుధ్య చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. మెడికల్ క్యాంపులు కొనసాగించాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మిగిలిన 5 టవర్ల పరిధిలో కూడా సిగ్నల్స్ పునరుద్ధరణ త్వరగా చేపట్టాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు.