ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా దావోస్ వెళ్లిన ఏపీ మంత్రి నారా లోకేశ్ వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. డబ్ల్యూఈఎఫ్ వేదికగా స్వనీతి ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ‘పర్యావరణ పరిరక్షణ – వాతావరణ ఉద్యమ భవిష్యత్’ అంశంపై సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమానికి పోర్చుగల్ ప్రధాని, జోర్డాన్ క్వీన్, యునెస్కో సైంటిస్ట్ తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. సంప్రదాయేతర ఇంధన రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు ప్రయత్నాలు చేస్తున్నామని లోకేశ్ తెలిపారు. కర్బన ఉద్గారాల నియంత్రణకు క్లీన్ ఎనర్జీ ఏకైక పరిష్కార మార్గమని సూచించారు. సుస్థిర శక్తి వనరుల్లో ప్రపంచ అగ్రగామి కావడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని చెప్పారు. పునరుత్పాదక ఇంధన రంగంలో ఏపీ గణనీయమైన ప్రగతి సాధించిందన్న లోకేశ్… భారత ప్రభుత్వం ఇటీవల ఏపీలో నాలుగు సోలార్ పార్కులు ప్రకటించిందని చెప్పారు. హరిత, ఇంధన పర్యావరణ వ్యవస్థ స్థాపనే ఏపీ లక్ష్యమని వెల్లడించారు. ఇందుకోసం ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ప్రకటించామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.
పునరుత్పాదక శక్తి రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులే లక్ష్యంగా ఈ విధానాన్ని తీసుకొచ్చామని లోకేశ్ తెలిపారు. తద్వారా 7.5 లక్షల మందికి ఉద్యోగ కల్పనే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ పవర్ ప్రాజెక్టుల కోసం 29 ప్రాంతాలు గుర్తించామన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఐఆర్‌ఈఎస్‌పీ ప్రాజెక్టు ఏపీలో ఉందని చెప్పారు. 2030 నాటికి 18 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యమే లక్ష్యంగా పెట్టుకున్నామని.. పునరుత్పాదక రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కృషి చేస్తున్నామఅని లోకేశ్ తెలిపారు.
బహుళజాతి ఐటీ సంస్థ సిస్కో వైస్ ప్రెసిడెంట్ ప్రాన్సిస్‌తోనూ లోకేష్ భేటీ అయ్యారు. విశాఖపట్నంలో సిస్కో గ్లోబల్ కెపాసిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు. ఫిలిప్ మోరిస్ సౌత్ ఈస్ట్ ఆసియా వైస్‌ఛైర్‌పర్సన్‌తో లోకేశ్ సమావేశమయ్యారు. ఏపీలో స్మోక్ ఫ్రీ సిగరెట్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం ఏపీలోని గుంటూరు అనువుగా ఉంటుందన్నారు.