29.5 C
Hyderabad
Sunday, February 9, 2025
spot_img

ఇంద్రియాల్లో ఇంద్రవైభవానికి అర్హనీయమైనవి నేత్రాలు

ధరణిపై ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ప్రతి ప్రాణికి బహిర్గత, అంతర్గత శారీరక అవయవాలు నిరంతరాయం పనిచేస్తూ ఉంటాయి. అల్పం, అధికం, ప్రాధాన్యం, అప్రాధాన్యం అనే మాటలకు తావులేకుండా అన్ని అవయవాలు సర్వవేళలా సేవలు అందిస్తుంటాయి. శరీర విభాగాల్లోని ఏ భాగం కాస్తంత అలసత్వం, నిర్లక్ష్యం ప్రదర్శించినా ఆరోగ్యవంతమైన ప్రాణి అనారోగ్యం పాలవుతుంది. శరీరంలోని అన్ని అవయవాలు ముఖ్యమైనవే అయినా, నేత్రాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. కళ్లు లేకపోతే జీవితమే అంధకారబంధురం అవుతుందని అంటారు. అందుకే సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. అంతటి అతి ముఖ్యమైన కన్ను విషయంలో ఎవరైనా ఎంత శ్రద్ధ వహించాలి, ఎన్ని జాగ్రత్తలు పాటించాలి, ఎంత అపురూపంగా చూసుకోవాలి అంటే.. శరీరంలో గుండె, మూత్రపిండాలు, వెన్నెముక తదితర అతి ప్రధానమైన భాగాలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో.. ఆ రీతిన కంటిపై శ్రద్ధ పెట్టాలి.

వైరాలు వచ్చి కారాలు మిరియాలు నూరుకున్నప్పుడు పళ్లు రాలగొట్టుకంటే…కట్టుడు పళ్లు కట్టుకోవచ్చేమో కాని.. కళ్ల జోలి వరకు కాంట్రవర్సీ తెచ్చుకుంటే కళ్లజోళ్లు, కళ్ల డ్రాప్స్, కళ్ల ఆయింట్ మెంట్ల వరకు వస్తుంది. ఇంకా మితిమీరితే రెటినా, రెప్పలు.. అన్ని కలిసి తిప్పలు పెట్టేయొచ్చు. టోటల్ బ్లైండ్ నెస్ కు కారణం కావచ్చు. అందుకే అందరూ ఒళ్లు దగ్గర బెట్టుకుని కళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని..పెద్దలందరూ చెబుతారు.

సర్వం, సంపూర్ణం, సమష్టి, సమిష్ట, సమ్మేళనం, సామూహికం అంటే మొత్తం అని ఐకమత్యం అని అర్థాలు వస్తాయి. ఐకమత్యమే మహాబలం.. అందరూ కలిసికట్టుగా ఉంటే ఎంత బలవంతుడి ఆటైనా కట్టేస్తుందని మనకు తెలుసు కదా..! ఒక్క మనుషులే కాదు.. ఐకమత్యంతో కపోతాలన్నీ కలిసి హంటర్ కు పరుగులు, ఆయాసం కల్గించిన కథ తెలుసు, బలవంతమైన సర్పం చలిచీమలతో చచ్చి ఊరుకుంటుందనే శతకం తెలుసు. మనుషులు, మూగజీవాలే కాదు శరీరంలోని భాగాలు సైతం ఐక్యతతో వ్యవహరించి తమ తమ విధులు నిర్వహించకపోతే ఆ జీవి ప్రాణాలు గాల్లొ కలిసిపోతాయి కదా..! వేటి పని అవి సక్రమంగా, నిరంతరాయంగా, నిర్విరామంగా శరీరంలోని అన్ని అవయవాలు పనిచేస్తుంటేనే.. ప్రాణి మనుగడ సాధ్యం. జీవకోటిలోని జీవి శరీరంలో నేత్రాలు అతి ముఖ్యమైనవి. నేత్ర ఆవశ్యకత, నేత్ర వైభవం గురించి ఎంత చెప్పినా తక్కువే.

కళ్లు లేకపోయినా గగనం నుంచి కన్నీళ్లు కార్చేది ఏది అంటే మేఘం అని ఠక్కున చెబుతాం. నేత్రవిహీనమైనా వర్షాన్ని ప్రసాదించి సర్వ ప్రాణికోటికి సర్వవిధాలా సహాయపడుతున్న మేఘం కంటే మనం ఎంత అదృష్టవంతులం నిక్షేపంగా కళ్లతో ఆ మేఘాన్ని చూడగలం, వర్షాన్ని చూడగలం, సర్వ జగత్తును చూడగలం. అంతటి నేత్రాలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. మనిషికి కావల్సినవి ఎన్నో ఉన్నా వినోదం, విహారం ముఖ్యమైనవి.. ఈ వినోద, విహారాలు తిలకించి ఆనందింప చేసేవి నేత్రాలు. నేత్రానందం…. సర్వానందానికి కారణం అవుతుంది. చక్కగా చూడ్డం అంటూ మొదలెడితే.. చల్లని ప్రకృతిని నేత్రాలతో చూడగలుగుతాం. నాటకాలు, సర్కస్ లు, దృశ్యాలు, దృశ్యకావ్యాలు.. ఇలా ఎన్నో నేత్రాలతో చూసి ఆనంద సాగరంలో తేలియాడుతాం.. సర్కాస్ ల్లో జంతువులు, కళాకారుల విన్యాసాలు చూసి మురిసిపోతాం. ఇక దృశ్యకావ్యాల్లో ఇష్టపడేది, వినోదం పొందేది, ఆనందించేది ఏది అంటే.. నిస్సందేహంగా సినిమాయే.

చలనచిత్ర రంగంలో…కళ్లకు సంబంధించిన గేయాలు సర్వభాషాల్లోనూ ఎన్నో వచ్చాయి. మచ్చుకు తెలుగు పాటలు చూస్తే…ప్రేమికుల సాంగ్స్ లో .. నా కళ్లు చెబుతున్నాయి అనే ఓ గేయ రచయిత గేయం రచిస్తే..కనులు కనులు కలిసెను అని మరొకరు, కంటి చూపు చెప్తోందని, కళ్లల్లో కళ్లు పెట్టి చూడమని, కళ్లల్లో పెళ్లిపందిరి కనబడసాగే… అని ఇలా ఎన్నో పాటలు వచ్చాయి. విషాదాలు, కన్ను ప్రాధాన్యం, కన్ను గొప్పదనం వివరించే పాటలు చాలా ఉన్నాయి. కనులు లేవని నీవు కలత పడవలదు, నా కనులు నీవిగా చేసుకుని చూడు అనే సాంగ్స్ వచ్చాయి. కన్ను మీద చిన్నచూపు కాదు కాని.. తన వాళ్లును పైకెత్తి పొగిడే సందర్భంలో.. అన్నయ్య లాంటి కన్నయ్య ఉంటే కన్నులెందుకు..అని పాట పాడేసి.. మళ్లీ కంటికి ఏం కోపం వస్తుందో, ఏం కొంప ములుగుతుందో.. అని… అన్నాచెల్లెళ్లు ఒకరి కన్నీరు ఒకరు తుడిచేసి.. కన్నూ..నిన్నేం అనలేదు అనే ఎక్స్ ప్లనేషన్లు ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. ఈ సరదా కబుర్లకేంగాని.. అసలు కంటి టోటల్ హిస్టరీ మొత్తం రెండు కళ్లతో చూసేద్దాం.

ప్రాణికోటి శరీరంలో.. ప్రధానంగా మానవ శరీరంలో కన్ను కీలకమైన ఇంద్రియ అవయవం. బహిరంగ విశ్వం గురించి మెదడుకు సంపూర్ణ సమాచారం అందించే మహత్తర ఇంద్రియ అవయవం కన్ను. కళ్లు ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి..? ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అని ప్రశ్నించుకుంటే…ప్రధానంగా కంటి చూపు విషయంలో ఏ చిన్న తేడా వచ్చినా కంటి వైద్యుని తప్పక సంప్రదించాలి. వైద్యుని సూచన మేరకు కంటి అద్దాలు, కాంటాక్ట్ లెన్స్ వాడాలి. కంటికి సంబంధించి ఏ అనారోగ్యం లేకపోయినా రెండేళ్లకోసారి కంటి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమచర్య. దురలవాట్లకు దూరంగా ఉండాలి, పొగాకు, ధూమపానం, మద్యపానానికి బానిసలుగా మారకూడదని వైద్యులు చెబుతున్నారు. ఈ రెంటిని దరిచేరకుండా చూసుకుంటే అత్యుత్తమం. ఒకవేళ ఈ వ్యసనాల బారిన పడితే.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని.. వైద్యుని పరివేక్షణలో నేత్రాలను రక్షించుకోవాలి.

నేత్ర వ్యాధులను పరిశీలిస్తే.. కంటి శుక్లం, కన్నీటి వాహిక అడ్డంకి, ఉబ్బిన కళ్లు ప్రోప్టోసిస్, కంటి కణితులు, కంటిలో మచ్చలు, డయాబెటిక్ రెటినోపతి, డ్రై ఐ సిండ్రోమ్, కండ్ల కలక, క్యాటరాక్ట్, గ్లకోమా మనకు ప్రధానంగా కనిపిస్తాయి. ఇంకా ఎన్నో నేత్రవ్యాధులు ఉన్నాయి. ఇతర వ్యాధుల కారణంగా వచ్చే నేత్రవ్యాధులు ఎన్నో ఉన్నాయి.

క్యాటరేక్ట్ అంటే కంటి శుక్లం. ఇది కంటి లెన్స్‌లో మేఘావృతమైన ప్రాంతం, ఇది కంటి దృష్టిలో క్షీణతకు దారితీస్తుంది . కంటిశుక్లం నెమ్మదిగా అభివృద్ధి చెంది కళ్ళను ప్రభావితం చేస్తుంది. క్షీణించిన రంగులు, అస్పష్ట దృష్టి, డబుల్ దృష్టి, కాంతి చుట్టూ అలలు, ప్రకాశవంతమైన లైట్లతో ఇబ్బంది, రాత్రి చూపులో ఇబ్బంది తదితర లక్షణాలు క్యాటరాక్ట్ కు కారణం కావచ్చు. కంటి లోపలి భాగాన్ని విండ్ షీల్డ్ లా రక్షించేది కార్నియా. కన్నీటి ద్రవం కార్నియాలను ద్రవపదార్థం చేస్తుంది. కార్నియాలు సైతం కాంతిని కళ్లలోకి ప్రవేశించే పనిలో భాగం అవుతాయి.

ఉబ్బిన కళ్లు, పఫ్వీ ఐస్ ను బోదకళ్లు అని సైతం అంటారు. ఉబ్బిన కళ్ల కింద తేలికపాటి వాపును పెరియోర్బిటల్ పఫ్నెస్ అని సైతం అంటారు. ఏ వయస్సువారికైనా ఈ నేత్రవ్యాధి రావచ్చని వైద్యులు చెబుతున్నారు. వృద్దుల కళ్ల చుట్టూ ఉన్న కణజాలం బలహీనపడటం ప్రారంభించినప్పుడు కళ్ళు ఉబ్బే పరిస్థితి రావచ్చు. ఉదయం నిద్ర లేచిన వెంటనే ఉబ్బిన కళ్లు పెద్దగా కనిపిస్తాయని చెబుతున్నారు. తేలికపాటి, తాత్కాలిక వాపు, కళ్లనీళ్లు, నల్లటి వలయాలు, కన్నీరు ఎర్రగా కన్పించడం, నిద్ర లేకపోవడం, దుఃఖం కారణంగా కళ్లు ఉబ్బే పరిస్థితి ఉంటుంది.

సమయపాలన పాటించకుండా తీసుకునే ఆహారం, నిద్రలేమి తదితర కారణాల వల్ల కళ్లు ఉబ్బుతాయి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి, మంచి పోషకాహారం, మంచి నిద్ర ఉండేటట్టు చూసుకోవాలని, ఉప్పు అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధి సంక్రమించవచ్చని కంటి వైద్యులు చెబుతున్నారు. అయితే, అలెర్జీలు వంటి అంతర్లీన సమస్యల వల్ల కళ్ళు ఉబ్బి ఉంటే, సరైన పరిష్కారం కోసం వైద్యుని సంప్రదించాలి. అదనపు ద్రవాలు బయటకు పంపడానికి పుష్కలంగా మంచినీరు తాగాలని అంటున్నారు. ఉబ్బిన కళ్ళ వల్ల చర్మపు దద్దుర్లు, తలనొప్పి, దృష్టి సమస్యలు ఉంటే, వైద్యుడిని తప్పక కలవాలి.

గ్లకోమా.. ఈ పేరు వింటేనే ఎవరైనా ఠారెత్తిపోతారు. నేత్ర వ్యాధుల్లో ఇది మొండి వ్యాధి, భయంకరమైనది. ఇదివరలో చాలామందికి అంధత్వం దీనివల్లే సంక్రమించేదని పెద్దలు చెబుతున్నారు. నీటికాసులు అనే పేరుతో పిలవబడే గ్లకోమా ఆప్టిక్ నరాలను దెబ్బతీస్తుంది. కళ్ల నుంచి మెదడుకు సమాచారాన్ని చేరవేసే ఆప్టిక్ నరాల దెబ్బతినడం వల్ల దృష్టిలోపం ఏర్పడుతుంది. సరియైన చికిత్స చేయకపోతే, దృష్టి నష్టం తాత్కాలికంగా కాని శాశ్వతంగాని ఉండవచ్చని, అయితే, ఇప్పుడు దీనికి పరిష్కార మార్గాలు చాలా వచ్చినట్టు వైద్యులు చెబుతున్నారు. హ్రస్వదృష్టి, దూరదృష్టిలను సాధారణ నేత్ర సమస్యలుగా తెలియజేస్తున్నారు. దీనికి సులోచనాలు సరిపోతాయని అంటున్నారు. ఏ పవర్ ఉన్నవారికి ఏ విధమైన కళ్ళజోడు పెట్టుకోవాలో సూచిస్తున్నారు. వివిధ కారణాల వల్ల వచ్చే తలనొప్పికి కంటి జబ్బులకు సంబంధం ఉండవచ్చు. కొన్ని కళ్లద్దాలతో తగ్గిపోతే, మరికొన్ని మందులద్వారా తగ్గుతాయి.

కళ్లకు సంబంధించిన ఏ సమస్యనైనా నిర్ధారించి, వైద్య పరీక్షలు, చికిత్సలు చేసేవారే ఆప్తమాలజిస్టులు. దృష్టి దిద్దుబాటు చేసి మందులు, కళ్లద్దాలను సూచించే కంటి వైద్యులు, నేత్రవ్యాధిగ్రస్తుడి వ్యాధి తీవ్రతను బట్టి శస్త్రచికిత్సలు సైతం చేస్తారు. హైపరోపియా దూరదృష్టి, మయోపియా హ్రస్వదృష్టి, శుక్లాలు, క్యాటరాక్ట్, గ్లకోమా, రెటీనా స్తబ్ధత, కార్నియల్, డయాబెటిస్ రెటినోపతి, కంటి గాయాలు… తదితర ఎన్నో నేత్ర రోగాలకు ఆప్తమాలజిస్ట్ వైద్య చికిత్స అందజేస్తారు. అయితే, నేత్రాలకు సంబంధించి ఏ చిన్న తేడా వచ్చినా, కళ్లకు ఏ స్వల్ప గాయాలైనా , కళ్లు ఎర్రబడినా, పచ్చగా మారినా.. వెంటనే కంటి వైద్యుడిని సంప్రదించాలి. స్లిట్ ల్యాంప్ ఎగ్జామ్ అనేది కంటి సంరక్షణ నిపుణుడు కళ్ళలోని ప్రతి భాగాన్ని చూడటానికి ఉపయోగించే పరీక్ష. ఇది సాధారణ కంటి పరీక్షలో ఒక సాధారణ భాగం. స్లిట్ ల్యాంప్ అనేది ఒక ప్రత్యేక మైక్రోస్కోప్, దానికి ప్రకాశవంతమైన కాంతిని జోడించి, కంటి సంరక్షణ నిపుణుడు కళ్ళలోని వివిధ భాగాలను చూడటానికి ఉపయోగిస్తారు.

Latest Articles

జనసేనకు తలనొప్పిగా మారిన కిరణ్ రాయల్ వ్యవహారం

తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ రాసలీలలకు సంబంధించిన వీడియోలు ఒక్కొక్కటిగా లీక్ అవుతున్నాయి. ఇవి ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు ఆ పార్టీని షేక్ చేస్తున్నాయి. యువతితో కిరణ్ రాయల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్