కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఉద్రిక్తత నెలకొంది. టిడిపిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. జడ్పి స్కూల్‌లో మధ్యాహ్నం భోజనం ఏజెన్సీ విషయంలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణకు దిగారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి వర్గీయులపై, రాఘవేంద్ర రెడ్డి వర్గం దాడి చేసింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మంత్రాలయం నియోజకవర్గంలో తిక్కారెడ్డి వర్గం, రాఘవేంద్ర రెడ్డి వర్గాల మధ్య విబేధాలు రోడ్డెక్కాయి. మంత్రాలయం టీడీపీ ఇంచార్జి తానేనని మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, స్టోర్ డీలర్లు తమకే కావాలని రాఘవేంద్ర రెడ్డి వర్గం పట్టు బడుతోంది. ఇప్పుడు ఏకంగా బాహాబాహికి దిగాయి. పది రోజుల క్రితం వంట ఏజెన్సీ కోసం ప్రాథమిక పాఠశాలలో ఒక్కరిపై ఒక్కరు దాడి చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పింఛన్ల పంపిణీ పండుగ రోజు ఇలా జరగడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు. విద్యార్థులు ముందే ఘర్షణకు దిగడంతో విద్యార్థులు సైతం భయాందోళనకు గురయ్యారు.