కైకాల సత్యనారాయణ మరణవార్త విని హుటాహుటీన ఆయన నివాసానికి చేరుకున్న చిరంజీవి కైకాల పార్థీవదేహాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. భౌతికదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చుతూ వెక్కివెక్కి ఏడ్చారు. కైకాలతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కైకాల పార్థివ దేహానికి చిరంజీవి, పవన్, త్రివిక్రమ్ నివాళులు అర్పించారు. కైకాలను ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించేవారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. తన చిన్నతనం నుంచి కైకాలతో పరిచయం ఉందన్నారు. కైకాల అంటే తనకు చాలా ఇష్టమని త్రివిక్రమ్ అన్నారు. పరిపూర్ణమైన జీవితం గడిపిన గొప్ప వ్యక్తి కైకాల అని అన్నారు. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు త్రివిక్రమ్.

నవరస నటసార్వ భౌముడు కైకాల సత్యనారాయణ మరణంతో టాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. రేపు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కైకాల సత్యనారాయణ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సినిమాటోగ్రఫీ మినిష్టర్ తలసాని శ్రీనివాస్ తెలిపారు. కైకాల సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించిన మంత్రి తలసాని.. కైకాల మూడు తరాలకు గుర్తుండే గొప్ప నటుడని కొనియాడారు.
కైకాల సత్యనారాయణ మృతికి సినీ ప్రముఖులునివాళులు అర్పించారు. సినీ కళామతల్లి ముద్దు బిడ్డ మరణం తీరని లోటని చిరంజీవి అన్నారు. కైకాల నటించిన వైవిద్యమైన పాత్రలను ప్రేక్షకులు మర్చిపోలేరని ట్వీట్ చేశారు. తెలుగు సినీ ఇండస్ట్రీ గొప్ప నటుడ్ని కోల్పోయిందని బాలకృష్ణ చెప్పారు. కైకాల ఆత్మకు శాంతి చేకూరాలన్నారు పవన్ కల్యాణ్. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కైకాల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. సినీ, ప్రజా జీవితంలో కైకాల అందించిన సేవలు మరువలేనివని అన్నారు.