ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ప్రభావం ఆమ్ ఆద్మీ పార్టీ పై తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో ప్రభుత్వ మార్పు జరగవచ్చంటూ ఊహాగానాలు రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. పంజాబ్‌లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఉన్న సంగతి తెలిసిందే. పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున భగవంత్ సింగ్ మాన్ ఉన్నారు. ఈ ఊహాగానాల నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ తో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు. ఢిల్లీలోని కపుర్తలా హౌస్‌లో భగవంత్ సింగ్ మాన్ తో పాటు పంజాబ్ మంత్రులు, ఆప్ ఎమ్మెల్యేలతో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారు.
పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీలో కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయన్న వార్తలు అమృత్‌సర్ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే పంజాబ్ లోని ఆప్ ఎమ్మెల్యేలు 30 మంది తనతో టచ్ లో ఉన్నారని కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా ఇటీవల ప్రకటించారు. బజ్వా చేసిన ఈ ప్రకటన పంజాబ్ రాజకీయవర్గాల్లో దుమారం రేపింది. ఢిల్లీ ఎన్నికల్లో ఓటమితో భగవంత్ సింగ్ మాన్, కేజ్రీవాల్ మధ్య ఇన్నాళ్లూ నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బయట పడ్డాయన్నారు. ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు మొదలైందన్నారు. అంతేకాదు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలంతా కాంగ్రెస్ శిబిరంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారని ప్రతాప్ సింగ్ బజ్వా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతాప్ సింగ్ బజ్వా చేసిన ప్రకటనను ఆప్ పార్లమెంటు సభ్యుడు మాల్విందర్ సింగ్ తోసిపుచ్చారు. ఆప్ ఎమ్మెల్యేలు కాదు కదా…కనీసం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా బజ్వాతో టచ్ లో లేరని మాల్విందర్ సింగ్ ఎద్దేవా చేశారు. కథ అక్కడితో ఆగలేదు. సాక్షాత్తూ బజ్వా సోదరుడే బీజేపీలో చేరాడన్నారు. సాక్షాత్తూ సోదరుడు బీజేపీలో చేరితేనే బజ్వా ఆపలేకపోయారని మాల్వింద్ సింగ్ ఎద్దేవా చేశారు. అంతేకాదు ఒకవైపు కాంగ్రెస్ నాయకులే స్వంత పార్టీని వీడుతుంటే, మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేల గురించి బజ్వా మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు మాల్విందర్ సింగ్.
కాగా భగవంత్ సింగ్ మాన్, అరవింద్ కేజ్రీవాల్ భేటీకి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యం లేదన్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు. ఇద్దరూ పార్టీ అగ్రనేతలేనన్నారు. ఒకే పార్టీకి చెందిన ఇద్దరు అగ్రనేతలు సమావేశం కావడం సర్వసాధారణమన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణపై చర్చించడానికే భగవంత్ సింగ్ మాన్ తో అరవింద్ కేజ్రీవాల్ సమావేశమయ్యారని ఆప్ నేతలు వివరణ ఇచ్చారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆప్, కాంగ్రెస్ మధ్య పొత్తు అవసరాన్ని ఇండియా కూటమి నేతలు గుర్తు చేస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ యే కారణమన్న అభిప్రాయం ఇండియా కూటమి నేతలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ పోటీ చేయడం వల్ల, ఆప్ నకు పోల్ కావాల్సిన ఓట్లు చీలిపోయాయన్నారు. అంతిమంగా భారతీయ జనతా పార్టీకి మేలు జరిగిందన్నది ఇండియా కూటమి నేతల విశ్లేషణ. జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ సీనియర్ నేత ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆప్, కాంగ్రెస్ కొట్టుకుని, చేతులారా బీజేపీని గెలిపించారని ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా ఆమ్ ఆద్మీ పార్టీయే తమతో పొత్తు వద్దనుకుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఢిల్లీలో పొత్తు విచ్ఛిన్నం కావడానికి కారణం కేజ్రీవాల్ ఒంటెద్దు పోకడలేనని కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ ఇటీవల కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే, బీజేపీని ఎదుర్కోవడానికి ఎలా కలిసి వెళ్లాలనే అంశంపై ఇండియా కూటమి నేతలు ఆలోచించాలని ఉద్దవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన నేత ప్రియాంకా చతుర్వేది సూచించారు. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలు కలహించుకోవడం వల్ల పరోక్షంగా బీజేపీ లాభ పడుతున్న విషయాన్ని గుర్తించాలని ప్రియాంకా చతుర్వేది పేర్కొన్నారు. బీజేపీని ధీటుగా ఎదుర్కోవడానికి ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలన్నీ కలిసి నడవాల్సిన అవసరం ఉందన్నారు.