స్వతంత్ర వెబ్ డెస్క్: జగన్ అక్రమాస్తుల కేసులో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కు సుప్రీం కోర్టు బుధవారం నోటీసులు జారీ చేసింది. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణ నిలిపివేయాలంటూ గతంలో తెలంగాణ హైకోర్టు… ట్రయల్ కోర్టును ఆదేశించింది. సీబీఐ ఛార్జీషీట్లపై తీర్పు వెలువడిన తర్వాత ఈడీ విచారణ చేపట్టాలని, ఒకవేళ రెండు దర్యాఫ్తు సంస్థలు విచారణను సమాంతరంగా జరిపితే సీబీఐ తీర్పు వెలువడిన తర్వాతే ఈడీ తీర్పు ఉండాలని హైకోర్టు ఆదేశించింది.
ఈడీ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీం ధర్మాసనం సెప్టెంబరు 5లోగా సమాధానం చెప్పాలని ప్రతివాదులుగా ఉన్న విజయసాయిరెడ్డి, భారతీ సిమెంట్స్, జగతి పబ్లికేషన్స్‌కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసు పూర్తి స్థాయి విచారణ ద్విసభ్య ధర్మాసనం చేపట్టాలో, త్రిసభ్య ధర్మాసనం చేపట్టాలో ఆరోజే నిర్ణయిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. సీబీఐ, ఈడీ కేసుల విచారణ సమాంతరంగా కొనసాగించవచ్చని గతంలో హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు తీర్పునివ్వగా.. తెలంగాణ హైకోర్టు దాన్ని పక్కన పెడుతూ సీబీఐ ఛార్జిషీట్లపై తీర్పు వెల్లడైన తర్వాతే ఈడీ కేసుల విచారణ చేపట్టాలని 2021లో తీర్పు ఇచ్చింది. మరో వైపు జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా జప్తు చేసిన భారతి ఆస్తుల విడుదలకు గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ కేసు విచారణ ఈనెల 14న సుప్రీంకోర్టులో జరగనుంది. జప్తు ఆస్తులకు సమాన విలువైన ఎఫ్డీలు తీసుకోవాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.