25.7 C
Hyderabad
Saturday, March 15, 2025
spot_img

లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర పరాభవం ….. డీలాపడ్డ గులాబీ నేతలు

  వరుస ఓటములతో బీఆర్‌ఎస్‌లో సమీక్షలు కరువయ్యాయి. గులాబీ గుభాళింపుతో సందడిగా ఉండే తెలంగాణ భవన్‌ కళ తప్పింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరపరాభవం బీర్‌ఎస్‌ నేతల్లో తీవ్ర నిరాశను నింపింది. ఇంతకు ఎన్నికల ఫలితాల అనంతరం గులాబీ శిబిరం పరిస్థితి ఏంటి..? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి..?

  బండ్లు ఓడలవుతాయి, ఓడలు బండ్లవుతాయన్న సామెత సరిగ్గా బీఆర్‌ఎస్‌కు సూట్‌ అవుతుంది. గత పదేళ్లుగా కళకళలాడిన గులాబీ వనం ఒక్కసారిగా వాడిపోయింది. కాంగ్రెస్‌ అధికార బలంతో కోలుకోని దెబ్బ కొట్టడంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, పార్లమెంట్‌ వరుస ఓటములు వెంటాడటంతో క్యాడర్‌ డీలా పడింది. మరోపక్క పార్టీ అగ్రనేతలు అంటీముట్టన్నట్టుగా వ్యవహరించడం మరింత అసంతృప్తిని కలిగిస్తుంది. ప్రస్తుత పరిస్థితులపై నోరు మెదపకుండా మౌనం వహించడం, భవిష్యత్‌ కార్యాచరణపై సమీక్షలు లేకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిస్తేజం అలుముకుంది. పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో ముగ్గురు ఎమ్మెల్యేలు వలస బాట పట్టగా ప్రస్తుత పరిస్థితులతో మరికొందరు ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

  అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ 39 సీట్లు సాధించి ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఆ వెంటనే పార్లమెంట్ ఎన్నికలు ఉండటంతో ఓటమి కసిని తీర్చుకోవాలన్న వ్యూహంతో తెలంగాణ భవన్‌ వేదికగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించింది. ఈ సందర్భంగా కార్యకర్తల నుంచి క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరాతీసింది. అదే సమయంలో త్వరలోనే జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహి స్తామని, అలాగే మండల స్థాయి వరకు కార్యకర్తలకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తామని సన్నాహక సమావేశాల్లో బిఆర్ఎస్ అధి ష్టానం తెలిపింది. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఈ లోగా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ రావడంతో మెరుగైన ఫలితాలపై దృష్టి సారించింది. అయితే, ఫలితాలపై పెట్టుకున్న ఆశలన్నీ నిరాశలయ్యాయి. కన్న కలలన్నీ కల్లలయ్యాయి. కనీసం ఒక్క సీటు కూడా రాకుండా బొక్కబోర్లా పడింది. ఎనిమిది లోక్‌సభ స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయి మరింత నిరాశలో కూరుకుపోయింది. దాదాపుగా తన ఓట్లశాతాన్ని సగానికి పైగా కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా బీఆర్‌ఎస్‌ సైలెంట్‌ అయిపో యింది. పార్టీ అధినేత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు పరిమితం కాగా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఓటమిపై ట్వీట్లతో కాలం వెల్లదీస్తున్నారు. దీంతో సమీక్షలు, సమావేశాలు లేక గులాబీ శ్రేణుల సందడి కరువైంది. తెలంగాణ భవన్‌ కళ తప్పింది. ముఖ్య నేతలెవరూ తెలంగాణ భవన్‌కు రాకపోవడంతో కార్యకర్తలు సైతం ఆ వైపు కనిపించడం లేదన్న చర్చ సాగుతోంది.

  బీఆర్‌ఎస్‌ తొలిసారి పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోల్పోయింది. అయితే, ఎన్నికల్లో ఓటమిపై ఇప్పటి వరకూ తెలంగాణభవన్‌ వేదికగా దానిపై చర్చలు జరిగింది లేదు. ఎలాంటి సమీక్షలు లేకపోవడంతో బిఆర్ఎస్ శ్రేణుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇకనైనా అగ్రనేతలు నిరాశ నుంచి తేరుకుని పార్టీని గాడిలో పెట్టాలని అందుకు సమీక్షలు నిర్వహించాలని భావిస్తున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిన అభ్యర్థులతో సమీక్ష ఏర్పాటు చేసి, క్షేత్రస్థాయి పరిస్థితులతోపాటు ఓటమికి కారణాలు తెలుసుకో వాలని సూచిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ నిర్మాణంపై స్పెషల్ ఫోకస్ పెడతామని అధిష్టానం గతంలో తెలిపింది. కానీ ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు. పార్టీ కమీటలన్నీ రద్దు చేసి నూతన కమిటీల నియామకం ద్వారా పార్టీలో జోష్ నింపే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చింది. పార్టీ ప్లినరీ నిర్వహించుకుని ఎన్నికలపై సమీక్షలు చేద్దామని అధినేత కేసీఆర్ చెప్పినప్పటికీ ప్లీనరీపై క్లారిటీ రాలేదు. దీంతో ఇకనైనా ఓటమి నిరాశ నుంచి తేరుకుని పూర్వవైభవం దిశగా కార్యాచరణ చేపట్టాలని అంటోంది గులాబీ క్యాడర్‌.

   పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కార్యకర్తలతో సందడిగా ఉండాల్సిన బీఆర్‌ఎస్‌ కార్యాయలం వరుస ఓటములతో బోసిపోయింది. గులాబీ శ్రేణుల కోలాహలం లేక కళ తప్పింది. మరోవైపు బిఆర్ఎస్ అగ్రనేతలు సైతం తెలంగాణ భవన్‌కు దూరంగా ఉంటున్నారు. మరి రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో వున్న గులాబీ పార్టీ తిరిగి పూర్వ వైభవం సాధిస్తుందా..? ఎప్పటిలా తెలంగాణ భవన్‌ కళకళలాడుతుందా అంటే, మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి మరి.

Latest Articles

మృత్యుదేవత ఎప్పుడు, ఎక్కడ, ఎవరిని, ఎందుకు కబళిస్తుందో…? రెండు రోజుల వ్యవధిలో బాలుడు, పోలీసు అధికారి లిఫ్ట్ భూతానికి బలి – తెల్లారితే చాలు…రోడ్డు, జల,ఆకాశ, ఆకస్మిక..ఇలా ఎన్నో ఆక్సిడెంట్లు

ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఏ ప్రమాదం దాపురిస్తుందో.. మృత్యుదేవత ఎందరి ప్రాణాలు తీసేస్తుందో ఎవరికి తెలియదు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు, విధి విధానాన్ని తప్పించడానికి ఎవరు సాహసించెదరు.. అనే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్